Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

వెయ్యి గ్రామాలకు చేరిన భూ రీసర్వే!

Author MANA VISHWAM | 10 Nov 2026, 09:34 PM | తాజా వార్తలు
వెయ్యి గ్రామాలకు చేరిన భూ రీసర్వే!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం వెయ్యి గ్రామాల మైలురాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూములకు కచ్చితమైన సరిహద్దులు నిర్ణయించి, ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా రీసర్వేను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో రీసర్వే చేపట్టగా, 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది.
మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో భూ రీసర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల స్పందన, సాంకేతిక ఇబ్బందులు, సర్వే సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులపై చర్చించారు. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాల్లో తొలిదశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో రీసర్వే చేపట్టారు. జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయడంతోపాటు నక్షాలు లేని గ్రామాలను కూడా చేర్చి మొత్తం 2,720 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సర్వే పూర్తయిన గ్రామాల్లో సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించడంతోపాటు సర్వేలో గుర్తించిన చిన్నపాటి పొరపాట్లను వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. భూ యజమానుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రతి భూమికి ఆధార్‌ సంఖ్య తరహాలో ప్రత్యేక గుర్తింపునిచ్చే భూధార్‌ నంబర్‌ కేటాయింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. రీసర్వే పురోగతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లతో ప్రత్యేక వీడియో సమావేశం నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేని తెలంగాణను నిర్మించడమే సమగ్ర భూ రీసర్వే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.