Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఎర్రవల్లి 325లో.. మా భూములూ కలిపేశారు!

Author MANA VISHWAM | 29 Sep 2026, 11:34 PM | తాజా వార్తలు
ఎర్రవల్లి 325లో.. మా భూములూ కలిపేశారు!

హైదరాబాద్‌/సిద్దిపేట, సెప్టెంబర్‌ 29 (మన విశ్వం): సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం మార్కూక్‌ మండలం శివారు వెంకటాపూర్‌ రైతుల భూముల వ్యవహారం ఎర్రవల్లి సర్వే నంబర్‌ 325తో ముడిపడి కొత్త వివాదంగా మారింది. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత తమ గ్రామ భూ రికార్డులు మారిపోయాయని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఎర్రవల్లి 325లో కలిపేశారని రైతులు ఆరోపించారు. సమగ్ర సర్వే నిర్వహించి ఎవరి భూమి వారికి ఇప్పించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు.
మంగళవారం సచివాలయంలో రైతులు మంత్రిని కలిసి పాత పాస్‌బుక్కులు, గ్రామ నక్షాతో వినతిపత్రం అందజేశారు. సమస్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాత రికార్డులు, గ్రామ నక్షా, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


134 ఎకరాలపై వివాదం

శివారు వెంకటాపూర్‌లోని సర్వే నంబర్లు 38, 41, 47, 85, 88, 100 పరిధిలో సుమారు 134 ఎకరాల్లో తమ తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు. ధరణికి ముందు తమ వద్ద పాస్‌బుక్కులు ఉన్నాయని, కొత్తవి ఇస్తామని పాతవి తీసుకున్నా తర్వాత ఇవ్వలేదని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి


ఓవర్‌ మ్యాపింగ్‌తో 325లోకి?

ఓవర్‌ మ్యాపింగ్‌ పేరుతో తమ గ్రామ భూములను ఎర్రవల్లి సర్వే నంబర్‌ 325లో కలిపి నక్షా రూపొందించారని రైతులు ఆరోపించారు. దీంతో భూములపై హక్కులకు సమస్య ఏర్పడిందని వాపోయారు. ఎర్రవల్లి 325లో చేపట్టిన తరహాలోనే తమ గ్రామంలోనూ సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు తేల్చాలని కోరారు. పాండురంగ రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయినా పరిహారం అందలేదని మంత్రికి వివరించారు.

రికార్డులే తేల్చనున్నాయి

ఎర్రవల్లి 325 భూముల సర్వే నేపథ్యంలో శివారు వెంకటాపూర్‌ రైతుల ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది. రికార్డులు ఎప్పుడు, ఎలా మారాయి? గ్రామాల అసలు హద్దులేంటి? రైతుల వాదనలో వాస్తవమెంత? అన్నది ఇప్పుడు రెవెన్యూ శాఖ విచారణ, క్షేత్రస్థాయి సర్వేలో తేలనుంది.