Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పట్టభద్రులపై.. గులాబీ గురి! వరంగల్‌–ఖమ్మం–నల్గొండ నేతలతో కేటీఆర్‌ కీలక భేటీ

Author MANA VISHWAM | 26 Sep 2026, 11:56 PM | తాజా వార్తలు
పట్టభద్రులపై.. గులాబీ గురి!  వరంగల్‌–ఖమ్మం–నల్గొండ నేతలతో కేటీఆర్‌ కీలక భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (మన విశ్వం): వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్‌ఎస్‌ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలకంగా సమావేశమయ్యారు. ఎన్నికకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఓటరు నమోదు దశ నుంచే క్షేత్రస్థాయిలో పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
సెప్టెంబర్‌ 28 నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి ఓటరు జాబితాను కొత్తగా రూపొందిస్తుండటంతో గతంలో ఓటు ఉన్న పట్టభద్రులు కూడా మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఎన్నికల్లో కీలకమని భావిస్తున్న బీఆర్‌ఎస్‌.. నియోజకవర్గ, మండల స్థాయిలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.


చేజారిన సీటుపై మళ్లీ కన్ను

ఈ స్థానం గతంలో బీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉండేది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికై ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో 2024లో జరిగిన ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం సాధించారు. దీంతో ఈసారి చేజారిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడంపై గులాబీ పార్టీ దృష్టి పెట్టింది.
మూడు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించిన ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దీంతో జిల్లా నుంచి మండల స్థాయి వరకు నేతలకు బాధ్యతలు అప్పగించి పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, వృత్తి నిపుణులను చేరుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థి ఎంపిక కంటే ముందుగా ఓటరు నమోదుపైనే పూర్తి దృష్టి పెట్టాలన్నది ప్రస్తుత బీఆర్‌ఎస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అభ్యర్థిత్వంపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉన్నప్పటికీ గత ఉపఎన్నికలో పోటీ చేసిన రాకేష్‌రెడ్డి పేరు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చలో ఉంది.
2024లో చేజారిన సీటు.. కొత్తగా ఓటరు జాబితా.. మూడు ఉమ్మడి జిల్లాల్లో ముందస్తు కసరత్తు..
పట్టభద్రుల పోరుకు సెప్టెంబర్‌ 28 నుంచే గులాబీ పార్టీ తొలి అడుగు వేస్తోంది.

ఇవి కూడా చదవండి