Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఖైరతాబాద్‌పై.. కమలం గురి!

Author MANA VISHWAM | 26 Sep 2026, 11:22 PM | తాజా వార్తలు
ఖైరతాబాద్‌పై.. కమలం గురి!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (మన విశ్వం): ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థి ఎంపికతో పాటు క్షేత్రస్థాయి వ్యూహానికి పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్య నేతలతో నిర్వహించిన లంచ్‌ మీట్‌కు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డి హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
దానం నాగేందర్‌ అనర్హతతో ఖైరతాబాద్‌ స్థానానికి ఉపఎన్నికకు మార్గం సుగమం కావడంతో బీజేపీ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. రేపు సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కిషన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఖైరతాబాద్‌లో పార్టీ పరిస్థితి, బూత్‌ల వారీగా బలాబలాలు, ప్రచార వ్యూహం, అభ్యర్థి ఎంపిక తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.


చింతల వైపే చూపు?

బీజేపీ అభ్యర్థిత్వ రేసులో చింతల రామచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2014లో బీజేపీ తరఫున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు నియోజకవర్గంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2023 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 38,094 ఓట్లు సాధించారు. తాజా ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన మరోసారి క్రియాశీలం కావడం, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అభ్యర్థిత్వంపై పార్టీ అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి


కిషన్‌రెడ్డి లెక్కలే కీలకం

ఖైరతాబాద్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండటం కూడా బీజేపీకి కీలకం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ సెగ్మెంట్‌లో కిషన్‌రెడ్డి సుమారు 17 వేల ఓట్ల ఆధిక్యం సాధించిన నేపథ్యంలో ఆ ఓటు బలాన్ని ఉపఎన్నికలోనూ సమీకరించడంపై పార్టీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
దీంతో ఖైరతాబాద్‌లో బీజేపీ వ్యూహం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు చింతల రామచంద్రారెడ్డి పేరు అభ్యర్థిత్వ చర్చల్లో ముందుండగా.. మరోవైపు కిషన్‌రెడ్డి స్వయంగా ముఖ్య నేతలతో వరుస సమావేశాలకు సిద్ధమవుతున్నారు.
అభ్యర్థి ఎవరు?.. బూత్‌ వ్యూహం ఎలా ఉండాలి?.. ప్రత్యర్థులను ఎదుర్కొనే కార్యాచరణ ఏంటి?.. అన్న అంశాలపై రేపటి సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఖైరతాబాద్‌ ఉపపోరుకు ముందే.. కమలం క్షేత్రస్థాయి కసరత్తును వేగవంతం చేస్తోంది.