Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

నెత్తురోడుతున్న తాడిచర్ల రోడ్లు!

Author MANA VISHWAM | 26 Sep 2026, 01:46 PM | తాజా వార్తలు
నెత్తురోడుతున్న తాడిచర్ల రోడ్లు!

మల్హర్, సెప్టెంబర్ 26 (మన విశ్వం): తాడిచర్లలో బొగ్గు రవాణా చేస్తున్న భారీ టిప్పర్ల రాకపోకలు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గ్రామ పరిధిలో ఓ పాడి బర్రెపైకి బొగ్గు టిప్పర్ దూసుకెళ్లడంతో దాని కాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో ఏఎంఆర్ బొగ్గు రవాణా వాహనాల వేగం, రహదారుల పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాడిచర్ల మీదుగా నిత్యం పెద్ద సంఖ్యలో బొగ్గు టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయని, కొన్ని వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రహదారులు గుంతలమయంగా మారగా, బొగ్గు దుమ్ముతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. గతంలోనూ టిప్పర్ల కారణంగా మూగజీవాలు ప్రమాదాలకు గురయ్యాయని పేర్కొంటున్నారు.


మనుషులు బలైతేనే మేల్కొంటారా?

“ఇప్పుడు మూగజీవాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.. రేపు చిన్నారులు, బాటసారులపై టిప్పర్లు దూసుకొస్తే బాధ్యత ఎవరిది?” అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు లేదని ఆరోపిస్తున్నారు. పాడి పశువులే జీవనాధారంగా ఉన్న రైతులకు ఇలాంటి ప్రమాదాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధిత రైతుకు తక్షణ నష్టపరిహారం చెల్లించడంతో పాటు జనావాసాల్లో టిప్పర్ల వేగాన్ని నియంత్రించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ధ్వంసమైన రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. రద్దీ సమయాల్లో గ్రామం మీదుగా భారీ బొగ్గు వాహనాల రాకపోకలను నియంత్రించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మైనింగ్, పోలీసు, స్థానిక యంత్రాంగం వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో బొగ్గు టిప్పర్లను అడ్డుకుని ఆందోళనకు దిగుతామని తాడిచర్ల గ్రామస్థులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి