Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

బడికి వెళ్లాలంటే.. ఈ గుంతలు దాటాల్సిందేనా?

Author MANA VISHWAM | 22 Sep 2026, 03:31 PM | తాజా వార్తలు
బడికి వెళ్లాలంటే.. ఈ గుంతలు దాటాల్సిందేనా?

కొమరం భీం, సెప్టెంబర్‌ 22 (మన విశ్వం): చేతిలో పుస్తకాల బ్యాగులు.. బడికి వెళ్లాలన్న తపన.. కానీ దారి మాత్రం గుంతలమయం. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట మండలం లోడ్‌పల్లి వద్ద రహదారి దుస్థితిపై విద్యార్థులు రోడ్డెక్కారు. పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
వర్షాలతో రహదారి మరింత దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందిగా మారిందని విద్యార్థులు వాపోయారు. ప్రతిరోజూ ఇదే మార్గంలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, గుంతల కారణంగా ప్రయాణం కష్టంగా మారిందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


చదువుకు ‘దారి’ ఏది?

గ్రామీణ విద్యార్థులకు పాఠశాల ఉండటం ఎంత ముఖ్యమో.. అక్కడికి సురక్షితంగా చేరుకునే రహదారి ఉండటం కూడా అంతే అవసరం. రోడ్డు దుస్థితి విద్యార్థులతో పాటు గ్రామస్తులు, రైతులు, అత్యవసర వైద్య సేవలకు వెళ్లేవారిపైనా ప్రభావం చూపుతుంది. చిన్నారులే పుస్తకాల బ్యాగులతో రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపే పరిస్థితి రావడం స్థానిక మౌలిక వసతుల సమస్యను వెలుగులోకి తెచ్చింది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చడంతో సరిపెట్టకుండా రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు. రోడ్డు మరమ్మతులకు నిధులు ఉన్నాయా? పనులు ఎప్పుడు చేపడతారు? అన్న అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి