Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న అరెస్ట్

Author MANA VISHWAM | 21 Sep 2026, 05:03 PM | తాజా వార్తలు
తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న అరెస్ట్

వరంగల్‌, సెప్టెంబర్‌ 21 (మన విశ్వం): గీసుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గరీబ్‌నగర్‌లో జరిగిన ఎలుబాక ప్రసాద్‌ (31) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రసాద్‌ను అతని అన్న ఎలుబాక ప్రవీణ్‌ (33) కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 19 రాత్రి సుమారు 9.30 గంటలకు గరీబ్‌నగర్‌లోని అద్దె ఇంట్లో ప్రసాద్‌ కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఛాతి, వీపు, భుజం ప్రాంతాల్లో తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి ఎలుబాక సుజాత ఫిర్యాదుతో గీసుగొండ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


డబ్బుల గొడవే కారణం?


పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ప్రవీణ్‌ తన తల్లి వద్ద తరచూ డబ్బులు అడిగే విషయంలో అన్నదమ్ముల మధ్య గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రసాద్‌పై కక్ష పెంచుకున్న ప్రవీణ్‌ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వెల్డర్‌గా పనిచేసే ప్రవీణ్‌ తాను తయారు చేసుకున్న కత్తిని వెంట తీసుకుని సెప్టెంబర్‌ 19 రాత్రి తల్లి, తమ్ముడు నివసించే ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో పనిచేసే తల్లి నైట్‌ డ్యూటీకి వెళ్లడంతో ప్రసాద్‌ ఒంటరిగా ఉన్నాడు. ఈ సమయంలో తమ్ముడితో కావాలనే వాగ్వాదానికి దిగి, కత్తితో వీపు, ఛాతి, భుజంపై పలుమార్లు పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర రక్తస్రావంతో ప్రసాద్‌ అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకుని వచ్చిన 108 సిబ్బంది అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. పెనుగులాటలో ప్రవీణ్‌ ఎడమ బొటనవేలికి కూడా గాయమైనట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి


‘తమ్ముడిని చంపింది నేనే’

హత్య అనంతరం కీర్తినగర్‌లోని తన ఇంటికి వెళ్లిన ప్రవీణ్‌ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పి తిరిగి తల్లి వద్దకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తమ్ముడి మృతదేహం వద్ద ఏడుస్తున్న తల్లిని కూడా బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చేతికి తగిలిన గాయానికి సెప్టెంబర్‌ 20 తెల్లవారుజామున గీసుగొండలోని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద ప్రవీణ్‌ చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. గాయం ఎలా జరిగిందని వైద్యుడు ప్రశ్నించగా, తమ్ముడిని కత్తితో పొడిచే సమయంలో తన చేతికి గాయమైనట్లు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆ వైద్యుడు సూచించినట్లు తెలిపారు.


పొదల్లో కత్తి, దుస్తులు

సెప్టెంబర్‌ 21న ప్రవీణ్‌ ఇంటివైపు వస్తున్నాడన్న సమాచారంతో గీసుగొండ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతడు ఇచ్చిన సమాచారంతో ఇంటి సమీపంలోని పొదల్లో దాచిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఈస్ట్‌జోన్‌ క్లూస్‌ టీమ్‌ సంఘటనా స్థలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. నిందితుడు ప్రవీణ్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
కేసు దర్యాప్తులో పాల్గొన్న గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌, ఎస్‌ఐలు అనిల్‌కుమార్‌, కుమార్‌, కానిస్టేబుళ్లు అరవింద్‌, విజయ్‌, ప్రవీణ్‌, భాస్కర్‌, రజినీకుమార్‌లను అధికారులు అభినందించినట్లు మామునూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ తెలిపారు.