Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

22ఏకు సూత్రధారి రేవంత్‌.. పాత్రధారి పొంగులేటి!

Author MANA VISHWAM | 11 Sep 2026, 11:58 AM | తాజా వార్తలు
22ఏకు సూత్రధారి రేవంత్‌.. పాత్రధారి పొంగులేటి!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (మన విశ్వం): 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘22ఏ స్కామ్‌కు రేవంత్‌ సూత్రధారి అయితే.. పొంగులేటి పాత్రధారి’’ అని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన 22ఏ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల తప్పిదంతోనో, ప్రభుత్వ పొరపాటుతోనో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లలేదని, నేరపూరిత ఆలోచనతోనే కోటి ఎకరాలను 22ఏ పరిధిలోకి తీసుకెళ్లారని ఆరోపించారు.
‘‘వీరప్పన్‌ అటవీశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో.. బ్లాక్‌మెయిలర్‌ సీఎం అయితే ఎలా ఉంటుందో.. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది’’ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలింగ్‌, బెదిరింపులకు పాల్పడేవారని ఆరోపించారు. ‘‘బ్లాక్‌మెయిలర్‌కు బ్లాక్‌మెయిల్‌ చేయడం బాగా తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.
22ఏ వ్యవహారం వెనుక ఒక ముఠా ఉందని కేటీఆర్‌ ఆరోపించారు. ఆ ముఠా కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం నడుస్తోందని పేర్కొన్నారు. ‘‘తమ్ముడు.. లెట్స్‌ డు కుమ్ముడు అన్నట్లుగా రేవంత్‌, పొంగులేటి తీరు ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై కేవలం క్షమాపణ చెప్పడంతో బాధ్యత తీరిపోదని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
‘‘అనుముల బ్రదర్స్‌, పొంగులేటి బ్రదర్స్‌ జైలుకు వెళ్లక తప్పదు’’ అని కేటీఆర్‌ హెచ్చరించారు. 22ఏ వ్యవహారంలో జరిగిన ప్రతి అంశాన్ని బయటకు తీసుకొస్తామని స్పష్టం చేశారు.
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నది ఇందుకేనా? ప్రజల భూములను 22ఏలో పెట్టి.. ఆ తర్వాత మీ ఖాతాల్లో వేసుకోవడానికేనా?’’ అని ప్రశ్నించారు. 22ఏ బాధితులకు బీఆర్ఎస్‌ అండగా ఉంటుందని, ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.