Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

హైదరాబాద్‌కు మరో గ్లోబల్‌ టెక్‌ బూస్ట్‌!

Author MANA VISHWAM | 10 Sep 2026, 08:59 PM | తాజా వార్తలు
హైదరాబాద్‌కు మరో గ్లోబల్‌ టెక్‌ బూస్ట్‌!

ప్రపంచ ఔషధ, జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ప్రపంచ ప్రఖ్యాత బయోఫార్మా సంస్థ ఎంఎస్‌డీ ఏర్పాటు చేసిన నూతన సాంకేతిక కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. హైటెక్‌ సిటీలో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం డిజిటల్‌ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధస్సు, ఇంజినీరింగ్‌ రంగాల్లో సంస్థ ప్రపంచ కార్యకలాపాలకు కీలకంగా పనిచేయనుంది.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణను కేవలం ఔషధ తయారీ కేంద్రంగా కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతకు ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 వేలకుపైగా జీవశాస్త్ర సంస్థలతో బలమైన వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు. జీనోమ్‌ వ్యాలీ లైఫ్‌సైన్సెస్‌ సామర్థ్యాలకు హైదరాబాద్‌లోని ఐటీ, సాంకేతిక మౌలిక వసతులు తోడవడం నగరానికి ప్రత్యేక బలంగా మారిందన్నారు.
అమ్‌జెన్‌, బ్రిస్టల్‌ మైయర్స్‌ స్క్విబ్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కార్యకలాపాలకు ఎంచుకోవడం రాష్ట్రంపై ప్రపంచ సంస్థలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఎంఎస్‌డీ కేంద్రం ద్వారా ఆధునిక డిజిటల్‌ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ నెక్స్ట్‌-జెన్‌ లైఫ్‌సైన్సెస్‌ పాలసీ 2026–30 ద్వారా పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణల మధ్య అనుసంధానాన్ని మరింత పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. 100 గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రతిభ, పరిశోధనా సామర్థ్యం, సాంకేతిక మౌలిక వసతులు ఒకేచోట అందుబాటులో ఉండటం హైదరాబాద్‌కు ప్రధాన బలమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తయారీ రంగంలో ఇప్పటికే ఉన్న ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే పరిశోధన, ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత సాంకేతికతలకు పెద్దపీట వేసి తెలంగాణను ప్రపంచ ఆరోగ్య, జీవశాస్త్ర ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.