Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుకూ.. లంచం!

Author MANA VISHWAM | 10 Sep 2026, 04:52 PM | తాజా వార్తలు
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుకూ.. లంచం!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (మన విశ్వం): పేదలకు వైద్య అవసరాల్లో అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కు విషయంలోనూ లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారం వెలుగుచూసింది. రూ.2 లక్షల వైద్య సాయం చెక్కు జారీ చేయడంతో పాటు మిగిలిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ను ప్రాసెస్‌ చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఉద్యోగులను తెలంగాణ ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. తెలంగాణ సచివాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న అందనేశి రాఘవేందర్‌, బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్‌లో టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేది వినోద్‌ కలిసి ఫిర్యాదుదారుడి సీఎంఆర్‌ఎఫ్‌ వైద్య రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ను ప్రాసెస్‌ చేసేందుకు లంచం డిమాండ్‌ చేశారు.
సీఎంఆర్‌ఎఫ్‌ పథకం కింద మంజూరైన రూ.2 లక్షల చెక్కును జారీ చేయడం, మిగిలిన వైద్య రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ను ముందుకు తీసుకెళ్లడం కోసం రూ.లక్ష ఇవ్వాలని కోరినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి నుంచి వినోద్‌ రూ.లక్ష తీసుకుని రాఘవేందర్‌కు అందజేయగా.. ఏసీబీ సిటీ రేంజ్‌–II అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రాఘవేందర్‌ వద్ద నుంచి లంచం సొమ్ము రూ.లక్షను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అంతకుముందే రాఘవేందర్‌.. వినోద్‌ ద్వారా ఫిర్యాదుదారుడి నుంచి ఫోన్‌పేలో రూ.5 వేల లంచం తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. దీంతో మొత్తం రూ.1.05 లక్షల లంచం వ్యవహారం బయటపడింది.
ఇద్దరు నిందితులను నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచారు.