Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రిజిస్ట్రేషన్లపై.. అవినీతి ముద్ర!

Author MANA VISHWAM | 10 Sep 2026, 01:09 PM | తాజా వార్తలు
రిజిస్ట్రేషన్లపై.. అవినీతి ముద్ర!

ప్రజల ఆస్తులకు చట్టబద్ధత కల్పించాల్సిన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. 2024 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబర్‌ 8 వరకు బహిరంగంగా అందుబాటులో ఉన్న కేసులను పేర్లు, తేదీలు, కార్యాలయాల వారీగా పరిశీలిస్తే కనీసం 16 మంది సబ్‌ రిజిస్ట్రార్‌, ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ స్థాయి అధికారులు లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లు, భూములకు సంబంధించిన కేసుల్లో చిక్కినట్లు తెలుస్తోంది. వీరిలో 2024లో ఏడుగురు, 2025లో ఐదుగురు, 2026 సెప్టెంబర్‌ 8 నాటికి మరో నలుగురు ఉన్నారు.
2024లో దూద్‌బౌలి ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ అమైర్‌ ఫరాజ్‌ రూ.2 లక్షల లంచం కేసులో చిక్కగా.. మహబూబాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా మహమ్మద్‌ రూ.19,200, గంగాధర ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ శివరాం సురేశ్‌బాబు రూ.10 వేలు, పరకాల సబ్‌ రిజిస్ట్రార్‌ సునీత రూ.80 వేల లంచం కేసుల్లో ఏసీబీ వలకు చిక్కారు. సూర్యాపేటలోనూ సబ్‌ రిజిస్ట్రార్‌పై లంచం కేసు నమోదైంది. అదే ఏడాది మరో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌ స్థాయి అధికారులు భూమి, నకిలీ రిజిస్ట్రేషన్‌ కేసుల్లో అరెస్టయ్యారు.
2025లోనూ అదే వరుస కొనసాగింది. మెట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆసిఫుద్దీన్‌ రూ.5 వేలు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ పర్వతం రామకృష్ణ రూ.20 వేలు, ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ జెక్కి అరుణ రూ.30 వేల లంచం కేసుల్లో చిక్కారు. ఆగస్టు 22న ఒకేరోజు వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేశ్‌కుమార్‌ రూ.70 వేల లంచం కేసులో, ఆదిలాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రెడ్డి రూ.5 వేల కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు.


2026లో ‘డిజిటల్‌’ ముడుపులు

ఈ ఏడాది ఫిబ్రవరిలో మంథని సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేందర్‌ రూ.16,500 లంచం కేసులో చిక్కారు. ఏప్రిల్‌లో వరంగల్‌ ఎస్‌ఆర్‌వో–I రామనర్సింహారావు, ఎస్‌ఆర్‌వో–II ఆనంద్‌లపై ఏసీబీ దర్యాప్తులో ఫోన్‌పే, యూపీఐ లావాదేవీలు కీలకంగా మారాయి. ఆనంద్‌కు అనుసంధానమైన రూ.44.28 లక్షల లావాదేవీలను గుర్తించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నగదు నుంచి డిజిటల్‌ మార్గాల వరకు ముడుపుల తీరు మారుతోందన్న అనుమానాలకు ఈ వ్యవహారం బలం చేకూర్చింది.
తాజాగా సెప్టెంబర్‌ 8న నారాయణపేట గ్రేడ్‌–II సబ్‌ రిజిస్ట్రార్‌ లగిశెట్టి వెంకటస్వామిపై ఏసీబీ కేసు నమోదైంది. ఇంటి రిజిస్ట్రేషన్‌కు రూ.90 వేలు డిమాండ్‌ చేసి, అందులో రూ.50 వేలను ప్రైవేటు వ్యక్తి ద్వారా స్వీకరించారని ఏసీబీ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి


మధ్యవర్తులే ‘వారధి’!

వరుస కేసుల్లో పదేపదే కనిపిస్తున్న అంశం మధ్యవర్తుల పాత్ర. కొన్ని ఘటనల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా లంచం స్వీకరించినట్లు ఏసీబీ ఆరోపించింది. అధికారి నేరుగా నగదు ముట్టుకోకుండా మధ్యవర్తుల ద్వారా వసూళ్లు సాగుతున్న ఉదంతాలు బయటపడటం.. కార్యాలయాల చుట్టూ ఉన్న అనధికార వ్యవస్థను కట్టడి చేయాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తోంది.


పొంగులేటి ప్రక్షాళన చేపడతారా?

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందు ఇప్పుడు కీలక సవాల్‌ కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం స్లాట్‌ బుకింగ్‌, డిజిటల్‌ సేవలు వంటి మార్పులు తీసుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వరుస అవినీతి కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.
32 నెలల్లో కనీసం 16 మంది సబ్‌ రిజిస్ట్రార్‌ స్థాయి అధికారులు కేసుల్లో చిక్కిన నేపథ్యంలో కేవలం ఏసీబీ చర్యలకే పరిమితం కాకుండా శాఖాపరమైన ప్రక్షాళన చేపడతారా అన్న ప్రశ్న ముందుకొస్తోంది. అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్న కార్యాలయాలపై ప్రత్యేక నిఘా, అనధికార మధ్యవర్తులకు అడ్డుకట్ట, అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై ఆడిట్‌, అధికారుల పనితీరుపై నిరంతర సమీక్ష, అక్రమాలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి.
ప్రజల ఆస్తులకు ‘రిజిస్ట్రేషన్‌ ముద్ర’ వేయాల్సిన శాఖపై పడుతున్న అవినీతి ముద్రను చెరిపేందుకు మంత్రి పొంగులేటి సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుడతారా?.. వరుస కేసుల తర్వాతైనా వ్యవస్థలో మార్పు తీసుకొస్తారా?.. అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.