Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ధాన్యం మాయం చేసిన మిల్లర్ల గుండెల్లో గుబులు..!

Author MANA VISHWAM | 01 Aug 2026, 04:53 PM | స్పెషల్ స్టోరీస్
ధాన్యం మాయం చేసిన మిల్లర్ల గుండెల్లో గుబులు..!

ప్రభుత్వ ధాన్యం మాయం చేసిన అక్రమార్కులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపడంతో హన్మకొండ,వరంగల్ జిల్లాల్లోని రైస్ మిల్లర్లలో గుబులు మొదలైంది. ఇటీవల జరిగిన తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అవకతవకల నేపథ్యంలో వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పలు మిల్లులు అధికారుల నిఘాలో ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించి అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లు ఎప్పుడు తమ మిల్లుపై విజిలెన్స్ బృందాలు దాడి చేస్తాయోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసి కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యవహారాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, మిల్లింగ్, రవాణా, ప్రభుత్వానికి అప్పగించిన సిఎంఆర్ తదితర అంశాలపై లోతుగా విచారణ సాగుతున్నట్లు సమాచారం. దీంతో అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న మిల్లర్లలో తీవ్ర కలవరం నెలకొంది.


ఆధారాలు సరిచేసే యత్నం... దాడులు జరగకుండా ప్రయత్నం...?

తనిఖీలు తప్పించుకునేందుకు కొందరు మిల్లర్లు నిల్వల లెక్కలు మార్చడం, రికార్డులను సరిచేయడం, ధాన్యాన్ని ఇతర ప్రాంతాల నుండి తెప్పించే ప్రయత్నం, డాక్యుమెంట్లలో మార్పులు చేయడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరికొంత మంది మిల్లర్ లు ప్రభావశీలుల ద్వారా దాడులు జరగకుండా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇవి కూడా చదవండి


రెండు జిల్లాల్లో నిఘా

హన్మకొండ, వరంగల్ జిల్లాల్లోని ఇప్పటికే కొన్ని మిల్లుల్లో జరిగిన తనిఖీలతో అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అదే ఆధారంగా మరిన్ని మిల్లులను లక్ష్యంగా చేసుకుని ఆకస్మిక దాడులకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. అవసరమైతే గత సీజన్ల లావాదేవీలను కూడా పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.


అక్రమాలు రుజువైతే కఠిన చర్యలు

తనిఖీల్లో ప్రభుత్వ ధాన్యం అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వసూలు చేసే చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. విజిలెన్స్ దాడుల పరంపరతో వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లలో తీవ్ర కలకలం రేగినట్లు తెలుస్తోంది.