Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

10 వేల మీటర్లలో గుల్వీర్ చరిత్ర

Author MANA VISHWAM | 29 Jul 2026, 03:16 PM | Sports
10 వేల మీటర్లలో గుల్వీర్ చరిత్ర

కామన్వెల్త్ అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. గ్లాస్‌గోలోని స్కాట్‌స్టోన్ స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో గుల్వీర్ 27 నిమిషాల 49.78 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో కామన్వెల్త్‌లో భారత అథ్లెటిక్స్‌కు మరో రజత పతకాన్ని అందించాడు.
స్వర్ణ పతకాన్ని ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్‌సన్ 27:48.93 నిమిషాల టైమ్‌తో సొంతం చేసుకోగా, గుల్వీర్ కేవలం స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. భారీ వర్షం మధ్య జరిగిన పోటీలో ప్రారంభం నుంచే అగ్రశ్రేణి అథ్లెట్లతో పోటీపడిన గుల్వీర్, చివరి ల్యాప్‌ల్లో వేగం పెంచి రజతాన్ని ఖాయం చేశాడు.
జాతీయ రికార్డు హోల్డర్ అయిన 28 ఏళ్ల గుల్వీర్ ఉత్తరప్రదేశ్‌లోని ఆత్రౌలీకి చెందినవాడు. ప్రస్తుతం భారత సైన్యంలో సేవలందిస్తున్న అతడు అమెరికన్ కోచ్ స్కాట్ సిమ్మన్స్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. ఆఫ్రికా అథ్లెట్ల ఆధిపత్యం ఉన్న ఈవెంట్‌లో తెలివైన వ్యూహంతో రేసును ముగించి చరిత్ర సృష్టించాడు. 1986 కామన్వెల్త్ క్రీడల తర్వాత తొలిసారి 10 వేల మీటర్ల పోటీలో పోడియంపై ఒక్క ఆఫ్రికా అథ్లెట్ కూడా లేకపోవడం మరో విశేషం.
విజయం అనంతరం గుల్వీర్ మాట్లాడుతూ.. పతకం సాధించడం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతినిస్తుందని, భారీ వర్షం వంటి ప్రతికూల పరిస్థితులు విజయంతో మరచిపోతామని తెలిపాడు. ఈ విజయాన్ని ఇంకా కుటుంబ సభ్యులకు చెప్పలేదని, ఇప్పుడు తన పూర్తి దృష్టి 5 వేల మీటర్ల పోటీపై ఉందని పేర్కొన్నాడు.
ఇదే పోటీల్లో పురుషుల హైజంప్ విభాగంలో భారత అథ్లెట్ సర్వేశ్ కుషేర్ కూడా రజత పతకాన్ని గెలిచి దేశ ఖాతాలో మరో పతకాన్ని జోడించాడు.
పూజా సింగ్‌కు నిరాశ
మహిళల హైజంప్‌లో భారత ఆశలు ఫలించలేదు. ఆసియా ఛాంపియన్ పూజా సింగ్ 1.82 మీటర్ల ఎత్తును అధిగమించడంలో విఫలమై పోటీ నుంచి నిష్క్రమించింది. భారీ వర్షం కారణంగా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి.