Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పోక్సో కేసు కక్ష.. గొడ్డలితో ఊచకోత ఆరుగురి దారుణ హత్య..

Author MANA VISHWAM | 11 Jul 2026, 09:18 AM | Crime
పోక్సో కేసు కక్ష.. గొడ్డలితో ఊచకోత  ఆరుగురి దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న సామూహిక హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. తనపై పోక్సో కేసు నమోదు చేయించారనే కక్షతో ఓ వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు. పగ తీర్చుకోవడానికే పరిమితం కాకుండా అడ్డువచ్చిన తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా కిరాతకంగా హతమార్చడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తిపై గత మే నెలలో ఓ మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణలతో షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బాధిత బాలిక, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్, తనను జైలుకు పంపించిన కుటుంబంపై తీవ్ర కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ముందస్తు ప్రణాళికతో బాధితుల ఇంటికి చేరుకున్న నిందితుడు, నిద్రలో ఉన్న వారిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు నిందితుడి భార్య, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పగతో ప్రారంభమైన ఈ దాడి చివరకు అమాయక చిన్నారుల ప్రాణాలు కూడా బలితీసుకోవడం హృదయ విదారకంగా మారింది.
హత్యల అనంతరం నిందితుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పినట్లు సమాచారం. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్‌తో పాటు పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హత్యల అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానంటూ కొందరు బంధువులకు ఫోన్ చేసిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.