Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

Author MANA VISHWAM | 05 Jun 2026, 12:41 PM | హైదరాబాద్
భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై రాష్ట్రంలోని 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగానే నిర్వహించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 నుంచి 100 శాతం వరకు పెంచింది. ప్లాట్ల విలువల్లో కూడా భారీ మార్పులు చేసింది. అపార్ట్‌మెంట్లకు మాత్రం 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే పెంపు ఇచ్చింది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎకరాకు కనిష్ఠ మార్కెట్ విలువ గతంలో రూ.1.75 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.2.75 లక్షలకు పెరిగింది. గరిష్ఠ మార్కెట్ విలువ మాత్రం హైదరాబాద్ బేగంపేట ప్రాంతంలో ఎకరాకు రూ.35.29 కోట్లుగానే కొనసాగుతోంది. ఓఆర్ఆర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భారీ పెంపులు చోటుచేసుకున్నాయి.

భూముల విలువల పెంపులో కోకాపేట, కొంగరకలాన్, రాయదుర్గం, హఫీజ్‌పేట్, నాగోల్ వంటి ప్రాంతాలు ముందున్నాయి. కోకాపేటలో ఎకరా విలువ రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెరిగింది. కొంగరకలాన్‌లో రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు, బుద్వేల్‌లో రూ.5.5 కోట్ల నుంచి రూ.8.25 కోట్లకు చేరింది. హఫీజ్‌పేట్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.18 కోట్లకు, రాయదుర్గంలో రూ.9 కోట్ల నుంచి రూ.15 కోట్లకు, నాగోల్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు లభించింది. జిల్లాల్లో కూడా భూముల మార్కెట్ విలువల్లో మార్పులు చేశారు. నల్గొండలో ఎకరా విలువ రూ.2.25 లక్షల నుంచి రూ.3.93 లక్షలకు పెరిగింది. మిర్యాలగూడలో రూ.4.5 లక్షల నుంచి రూ.6.75 లక్షలకు, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.25 లక్షల నుంచి రూ.6.03 లక్షలకు చేరింది. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.78.40 లక్షల నుంచి రూ.90.16 లక్షలకు పెంపు నమోదైంది.ప్లాట్ల మార్కెట్ విలువల్లో అత్యధిక పెంపు కోకాపేటలో కనిపించింది. అక్కడ చదరపు గజం విలువ రూ.23,800 నుంచి రూ.47,600కు పెరిగింది. అత్తాపూర్‌లో రూ.20,300 నుంచి రూ.30,500కు, కొంపల్లిలో రూ.11,600 నుంచి రూ.17,400కు చేరింది. హనుమకొండలో గజం విలువ రూ.5,800 నుంచి రూ.8,700కు, కాజీపేటలో రూ.9,500 నుంచి రూ.14,250కు పెరిగింది. అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువల్లో మాత్రం పరిమిత పెంపు మాత్రమే జరిగింది. అజంపురా, మాసబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.2,500 నుంచి రూ.2,700కు పెరిగింది. ఆమనగల్లులో రూ.1,300 నుంచి రూ.1,600కు, మంకాల్, మోకిల, కొంపల్లి ప్రాంతాల్లో రూ.2,200 నుంచి రూ.2,700కు చేరింది. బాలానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.3,000గా నిర్ణయించారు.