Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

అడవుల రక్షణలో నిర్లక్ష్యం వద్దు!

Author MANA VISHWAM | 06 Nov 2026, 09:21 PM | తాజా వార్తలు
అడవుల రక్షణలో నిర్లక్ష్యం వద్దు!

అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారులను ఆదేశించారు. అడవుల్లో అక్రమ వేటను అరికట్టడంతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తాడ్వాయి, ఏటూరునాగారం, కొండాయి అటవీ ప్రాంతాలను ఆయన సందర్శించారు. జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాలతో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.

తాడ్వాయి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం, వాటి ఆవాసాల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏటూరునాగారం అభయారణ్యాన్ని సందర్శించి అటవీ సంపద సంరక్షణకు ఎదురవుతున్న సవాళ్లపై సమీక్షించారు. వన్యప్రాణుల వేటను అడ్డుకునేందుకు నిరంతర నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద కదలికలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవుల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత శాఖల మధ్య సమాచార మార్పిడి మరింత మెరుగుపడాలని స్పష్టం చేశారు.

కొండాయి అటవీ ప్రాంతంలోని నిఘా గోపురాన్ని పరిశీలించిన జయేశ్ రంజన్, గుత్తికోయల నివాస ప్రాంతాలను సందర్శించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలతో సమన్వయం పెంచుకుని వన్యప్రాణుల సంరక్షణలో వారిని భాగస్వాములను చేయాలని సూచించారు. మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు సంభవించిన వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

అడవులు, వన్యప్రాణుల రక్షణ కేవలం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదని, జిల్లా యంత్రాంగంలోని అన్ని విభాగాలు సమష్టిగా కృషి చేయాలని జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. అక్రమ వేట, అగ్ని ప్రమాదాల నివారణకు సంయుక్త కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. భావితరాలకు ప్రకృతి సంపదను అందించేందుకు అటవీ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.