Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మంత్రికి మచ్చ తెస్తున్నదెవరు?

Author MANA VISHWAM | 02 Nov 2026, 06:03 PM | తాజా వార్తలు
మంత్రికి మచ్చ తెస్తున్నదెవరు?

అక్రమాలను సహించబోమన్న అమాత్యుడి మాటలకు విలువేదీ?

ఖిలా వరంగల్‌ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అధికారుల తీరుపై ప్రశ్నలు

ఆధారాలతో కథనాలు వెలువరించినా చర్యల్లో జాప్యమెందుకు?

మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా?.. జిల్లా రిజిస్ట్రార్‌ మౌనమెందుకు?

డీఐజీ సాబ్‌.. మంత్రికి చెడ్డపేరు తెస్తున్న వ్యవహారం మీకైనా తెలుసా?


అక్రమాలను సహించేది లేదని మంత్రి చెబుతున్నారు.. నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి ఆ మాటలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? ఖిలా వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాదాస్పద రిజిస్ట్రేషన్ల వ్యవహారం అధికారుల తీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పత్రాల సంఖ్యలతో సహా ‘మన విశ్వం’ వరుస కథనాలు ప్రచురించినా విచారణ పురోగతి, చర్యల విషయంలో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. మంత్రి అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని చెబుతుంటే.. అధికారులు చర్యల్లో జాప్యంతో ఆయన ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్నారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.


మంత్రి మాటలకు విలువ లేదా?

రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలకు తావులేదని మంత్రి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఖిలా వరంగల్‌ వ్యవహారం అధికార యంత్రాంగానికి పరీక్షగా మారింది. అసలు ఈ వ్యవహారం మంత్రి దృష్టికి తీసుకెళ్లారా? ఆరోపణల తీవ్రతను వివరించారా? మంత్రి నుంచి నిర్దిష్ట ఆదేశాలు వచ్చాయా? వస్తే అమలు చేశారా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అధికారులే జాప్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


అమాత్యుడి ప్రతిష్ఠతో ఆటలాడుతున్నారా?

ఇవి కూడా చదవండి

ఖిలా వరంగల్‌ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట్‌లాల్‌ హయాంలో జరిగిన పలు రిజిస్ట్రేషన్లపై ఆరోపణలు ఉన్నాయి. ఒకే ఇంటి నంబర్‌తో వేర్వేరు స్థలాలకు రిజిస్ట్రేషన్లు, సరైన ఆధార పత్రాలు లేకుండా రిజిస్ట్రేషన్ లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2064/2026, 2063/2026, 1995/2026, 1254/2026, 1253/2026, 1252/2026 తోపాటు మరికొన్ని పత్రాల సంఖ్యలను ‘మన విశ్వం’ ఇప్పటికే ప్రస్తావించింది. వీటిపై నిష్పాక్షిక విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. విచారణలో జాప్యం కొనసాగితే దాని ప్రభావం మంత్రి ప్రతిష్ఠపైనా పడే అవకాశం ఉంది.


రాజేష్‌పై వేటు.. వెంకట్‌లాల్‌పై ఎందుకు జాప్యం?

గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేష్‌పై సస్పెన్షన్‌ చర్యలు తీసుకున్న అధికారులు, ప్రస్తుతం వెంకట్‌లాల్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో వేగంగా స్పందించిన ఉన్నతాధికారులు ఇప్పుడు విచారణను ఎందుకు పూర్తి చేయడం లేదు? ఆరోపణలు నిర్ధారణ అయితే సస్పెన్షన్‌తో సహా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? ఒకే శాఖలో వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.


జిల్లా రిజిస్ట్రార్‌ జాప్యం.. మంత్రికి అపఖ్యాతి?

వివాదాస్పద రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జిల్లా రిజిస్ట్రార్‌ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘మన విశ్వం’ ప్రస్తావించిన పత్రాలను పరిశీలించారా? ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి వివరణ తీసుకున్నారా? డీఐజీకి నివేదిక సమర్పించారా? విచారణ ఏ దశలో ఉంది? ఈ వివరాలను వెల్లడించకపోవడంతో జిల్లా స్థాయిలోనే వ్యవహారాన్ని సాగదీస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి అవినీతిని సహించబోమని ప్రకటిస్తున్న సమయంలో అధికారుల జాప్యం ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.


డీఐజీ సాబ్‌.. మంత్రికి మచ్చ తెస్తున్నది ఎవరు?

ఖిలా వరంగల్‌ వ్యవహారం డీఐజీ దృష్టికి వెళ్లిందా? జిల్లా రిజిస్ట్రార్‌ నుంచి నివేదిక అందిందా? అందితే చర్యలు ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌కు ఉన్నతాధికారుల అండ ఉందన్న ప్రచారంలో వాస్తవమెంత? మంత్రికి తెలియకుండానే వ్యవహారం జిల్లా స్థాయిలో నిలిచిపోయిందా? లేక ఆయన దృష్టికి వెళ్లినా నిర్ణయం ఆలస్యమవుతోందా? అన్నది తేలాల్సి ఉంది.


మంత్రి జోక్యం చేసుకుంటారా?

అక్రమాలను సహించబోమన్న మాటలను చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఖిలా వరంగల్‌ వివాదాస్పద రిజిస్ట్రేషన్లపై మంత్రి స్వయంగా దృష్టిసారించి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిరాధారమైతే అధికారికంగా స్పష్టత ఇవ్వాలి. విచారణ పేరుతో కాలయాపన చేస్తే ప్రభుత్వ ప్రతిష్ఠకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అవినీతిపై రాజీలేని వైఖరి ప్రకటిస్తున్న మంత్రి ఈ వ్యవహారంలో తన చిత్తశుద్ధిని చేతల్లో చూపిస్తారా? లేక అధికారుల జాప్యంతో అమాత్యుడి ప్రతిష్ఠకు మచ్చ పడుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.