Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పవర్‌ ప్లాంట్లలో.. అసలేం జరుగుతోంది?

Author MANA VISHWAM | 23 Sep 2026, 10:48 PM | తాజా వార్తలు
పవర్‌ ప్లాంట్లలో.. అసలేం జరుగుతోంది?

హైదరాబాద్‌ (మన విశ్వం): తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి, బొగ్గు సరఫరాపై అధికార–ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో అసలు ఏం జరుగుతోంది? విద్యుత్‌ ఉత్పత్తి ఎందుకు తగ్గుతోంది? బొగ్గు నిల్వల పరిస్థితి ఏంటి? యూనిట్లు ఎందుకు నిలిచిపోతున్నాయి? అన్న నిజానిజాలను క్షేత్రస్థాయిలో తేల్చేందుకు బీఆర్‌ఎస్‌ ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.
నేడు రాష్ట్రంలోని ఐదు ప్రధాన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో పాటు సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఈ బృందాలు సందర్శించనున్నాయి. బొగ్గు నిల్వలు, సరఫరా, విద్యుత్‌ ఉత్పత్తి, నిలిచిపోయిన యూనిట్లు, సింగరేణి–జెన్‌కో మధ్య బకాయిలను పరిశీలించి నివేదిక రూపొందించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.
యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని నల్గొండ నాయకుల బృందం వెళ్లనుంది. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బృందం, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ బృందం పరిశీలించనున్నాయి.
కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బృందం వెళ్లనుంది. సింగరేణి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్‌ జాదవ్‌, కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య తదితరుల బృందం పరిశీలించనుంది.
సింగరేణి ప్రధాన కార్యాలయానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, శంభీపూర్‌ రాజుతో కూడిన ఆరో బృందం వెళ్లనుంది.


బొగ్గు లెక్కలే టార్గెట్‌

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, బొగ్గు సరఫరా పరిస్థితిపై కేటీఆర్‌ పలు ఆరోపణలు చేశారు. యాదాద్రి థర్మల్‌ కేంద్రం పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయకపోవడం, ఇతర కేంద్రాల్లో యూనిట్ల పరిస్థితి, సింగరేణి నుంచి బొగ్గు సరఫరా, జెన్‌కో బకాయిలపై వాస్తవాలను ప్రజల ముందుంచుతామని చెప్పారు. కేటీఆర్‌ పేర్కొన్న ఆరోపణలు, గణాంకాలపై ప్రభుత్వం, సంబంధిత సంస్థల అధికారిక వివరణ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి


నేడే క్షేత్రస్థాయిలో లెక్క!

బీఆర్‌ఎస్‌ బృందాలు నేడు క్షేత్రస్థాయిలో సేకరించే వివరాలను ప్రజల ముందుంచుతామని కేటీఆర్‌ ప్రకటించారు. దీంతో పవర్‌ ప్లాంట్లలోకి బృందాలను అనుమతిస్తారా? బొగ్గు నిల్వలు, విద్యుత్‌ ఉత్పత్తిపై ఎలాంటి వివరాలు బయటకు వస్తాయి? బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు ప్రభుత్వం ఏ లెక్కలతో సమాధానం ఇస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.