Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

22ఏ చిక్కులకు.. హైపవర్‌ కమిటీ!

Author MANA VISHWAM | 18 Sep 2026, 01:35 PM | TELANGANA
22ఏ చిక్కులకు.. హైపవర్‌ కమిటీ!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (మన విశ్వం): 22ఏ నిషేధిత జాబితాలో చిక్కుకుని రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన కొన్ని వర్గాల ఆస్తులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రిజిస్ట్రేషన్‌ చట్టం–1908లోని సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులకు సంబంధించిన నిర్దిష్ట పెండింగ్‌ కేసులను పరిశీలించి పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌–I) శాఖ సెప్టెంబర్‌ 17న జీవో ఆర్‌టీ నెం.564 జారీ చేసింది.
భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యుడిగా, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సభ్యుడు–కన్వీనర్‌గా ఉంటారు.


ఆగిన రిజిస్ట్రేషన్లపై ఫోకస్‌

సంబంధిత అధికార సంస్థలు ఆమోదించిన లేఅవుట్లలో 22ఏ కారణంగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లను కమిటీ పరిశీలించనుంది. సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని ఆస్తులకు సంబంధించిన కేసులు, జీవో ఎంఎస్‌ నెం.59తో తలెత్తిన వ్యవహారాలు, సికింద్రాబాద్‌ ప్రాంతంలో లీజుహోల్డ్‌ ఆస్తులను ఫ్రీహోల్డ్‌గా మార్చే కేసులు కూడా కమిటీ పరిధిలోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి


రికార్డులన్నీ తెప్పించే అధికారం

పెండింగ్‌ కేసుల పరిశీలన కోసం ఏ ప్రభుత్వ శాఖ, శాఖాధిపతి లేదా జిల్లా కలెక్టర్‌ నుంచైనా రికార్డులు, సమాచారం కోరే అధికారాన్ని కమిటీకి ప్రభుత్వం కల్పించింది. అవసరాన్ని బట్టి ఇతర అధికారులను కూడా సహకారానికి తీసుకోవచ్చని జీవోలో పేర్కొంది.
రాష్ట్రంలో 22ఏ భూములపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఈ కమిటీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ జీవోతో 22ఏలోని అన్ని భూములు నిషేధిత జాబితా నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోవు. జీవోలో పేర్కొన్న కేటగిరీలకు సంబంధించిన పెండింగ్‌ కేసులను పరిశీలించి పరిష్కరించడమే కమిటీ బాధ్యత.
ఇప్పుడు కమిటీ ముందుకు ఎన్ని కేసులు వస్తాయి? వాటి పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది? కేసుల వారీగా నిర్ణయాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి? అన్నదే 22ఏ బాధితుల్లో ఆసక్తి రేపుతోంది.