Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

యూరియా బస్తా వెనుక.. ‘లింకు’ దందా!

Author MANA VISHWAM | 15 Sep 2026, 04:08 PM | తాజా వార్తలు
యూరియా బస్తా వెనుక.. ‘లింకు’ దందా!

రైతుల ఫిర్యాదుతో కదిలిన వ్యవసాయ శాఖ

నల్లబెల్లిలో ఎరువుల దుకాణంపై ఆకస్మిక తనిఖీ

యూరియా విక్రయాలపై పంచనామా.. రికార్డుల పరిశీలన

బస్తాకు అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారన్న ఆరోపణ

మందులు కొనకపోతే యూరియా ఇవ్వరంటూ రైతుల ఆవేదన

ఇవి కూడా చదవండి

నల్లబెల్లి, సెప్టెంబర్ 15 (మన విశ్వం): యూరియా బస్తా కావాలంటే పురుగుమందులూ కొనాల్సిందేనా?.. నిర్ణీత ధరకు మించి అదనంగా చెల్లించాల్సిందేనా?.. నల్లబెల్లి మండల కేంద్రంలో యూరియా విక్రయాలపై రైతుల నుంచి వెల్లువెత్తిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. యూరియాతో పాటు ఇతర ఎరువులు, పురుగుమందులు లేదా వ్యవసాయ ఉత్పత్తులను ‘లింకు’ పేరుతో కొనుగోలు చేయాలని కొందరు వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. దీనికితోడు బస్తాకు నిర్ణీత ధరపై రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
రైతుల నుంచి సమాచారం అందడంతో వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏఓ బన్ను రజిత సంబంధిత ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి యూరియా నిల్వలు, విక్రయ రికార్డులు, బిల్లులను పరిశీలించారు. యూరియా విక్రయాలకు ఇతర ఉత్పత్తులను ముడిపెడుతున్నారన్న ఫిర్యాదులపై ఆరా తీసి పంచనామా నిర్వహించినట్లు సమాచారం.


ఆరోపణ నుంచి.. పంచనామా దాకా!

ఆన్‌లైన్‌లో యూరియా బుక్ చేసుకున్నా దుకాణానికి వెళ్లిన తర్వాత ఇతర ఉత్పత్తులు కొనాలని చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అవసరం లేని మందులు తీసుకోకపోతే యూరియా ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు. రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు దుకాణాన్ని తనిఖీ చేసి పంచనామా నిర్వహించడంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది.


ఒక్క షాపుతో సరిపెడతారా?

మండలంలోని అన్ని ఎరువుల దుకాణాల్లోనూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దుకాణాలకు వచ్చిన యూరియా ఎంత?.. విక్రయించింది ఎంత?.. ఆన్‌లైన్ బుకింగ్ లెక్కలకు విక్రయ రికార్డులు సరిపోతున్నాయా?.. నిర్ణీత ధరలనే వసూలు చేస్తున్నారా?.. ‘లింకు’ పేరుతో ఇతర ఉత్పత్తులను అంటగడుతున్నారా?.. అన్న అంశాలను నిగ్గుతేల్చాలని కోరుతున్నారు.
రైతుకు అందాల్సిన యూరియా అదనపు వ్యాపారానికి మారకూడదని, విచారణలో నిబంధనల ఉల్లంఘన నిర్ధారణైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమాచారంపై వెంటనే స్పందించి తనిఖీ చేపట్టిన ఏఓ బన్ను రజిత చర్యను వారు అభినందించారు.