Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..!

Author MANA VISHWAM | 31 Jul 2026, 10:22 PM | హైదరాబాద్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..!

తెలంగాణ దేశంలోనే పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన, అనుకూలమైన రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత (CII NR) ప్రతినిధులను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు రక్షణగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. మంచి ప్రతిపాదనలతో ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు.


ఫ్యూచర్ సిటీపై భారీ ఆశలు

30 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ లో ప్రపంచంలోని ఫార్చ్యూన్–500 కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు 175 దేశాల ప్రతినిధులు హాజరయ్యారని గుర్తు చేశారు. "తెలంగాణ రైజింగ్–2047" విజన్‌తో రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, దానిని 10 శాతానికి పెంచడమే తమ సంకల్పమని చెప్పారు.


క్యూర్–ప్యూర్–రేర్ అభివృద్ధి నమూనా

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణను క్యూర్, ఫ్యూర్, రేర్ అనే మూడు అభివృద్ధి మండలాలుగా విభజించినట్లు సీఎం వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని సేవారంగానికి, ఓఆర్‌ఆర్–ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాంతాన్ని తయారీ పరిశ్రమలకు, రీజినల్ రింగ్ రోడ్ వెలుపల ప్రాంతాన్ని వ్యవసాయం, అగ్రి ఆధారిత పరిశ్రమలకు కేటాయిస్తున్నామని వివరించారు.
పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు వేగంగా అందిస్తామని, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మాణం చేపడతామని తెలిపారు.

ఇవి కూడా చదవండి


మౌలిక వసతులపై దూకుడు

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని సీఎం తెలిపారు. శంషాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే వరకు బుల్లెట్ రైలు మార్గాలు రానున్నాయని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు.


ఏఐ సవాళ్లకు నైపుణ్యమే సమాధానం

కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటి ని ఏర్పాటు చేశామని, దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలనే బోధిస్తున్నామని, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి దాదాపు 100 శాతం ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు.
అమెజాన్ సంస్థ డేటా సెంటర్లపై రూ. లక్ష కోట్ల పెట్టుబడులు, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 200కు పైగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (GCCలు) పెట్టుబడులకు ముందుకొచ్చాయని చెప్పారు.

'తెలంగాణ విధానాలు ఆకట్టుకున్నాయి'

సీఐఐ ఉత్తర ప్రాంత చైర్మన్ పునీత్ కౌరా మాట్లాడుతూ, తెలంగాణ పారిశ్రామిక విధానాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వేగవంతమైన నిర్ణయాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాల కారణంగానే హైదరాబాద్‌ను అధ్యయన పర్యటనకు ఎంపిక చేసుకున్నామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అత్యంత అనువైన గమ్యస్థానంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.