🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 06 November 2026, 09:17 PM Posted by: MANA VISHWAM

కరెంటు కోతలతో కళ్లముందే ఎండుతున్న పంటలు!

ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచడం లేదంటూ అన్నదాతలు కన్నీటిపర్యంతమయ్యారు. విద్యుత్ కోతలు, సాగునీటి కొరత తమను అప్పుల ఊబిలోకి నెట్టాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో హరీశ్‌రావు పర్యటించి ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు. గతంలో రెండు పంటలు పండించుకున్న తాము ప్రస్తుతం ఒక్క పంటను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సాగు చివరి దశలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పెట్టుబడులన్నీ నేలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకున్న ఏడు ఎకరాల్లో వరి సాగుచేయగా విద్యుత్, నీటి కొరతతో పంట పూర్తిగా ఎండిపోయిందని కుమార్ అనే రైతు హరీశ్‌రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పులు చేసి సాగుచేసిన పంట చేతికందకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని వాపోయారు. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆరోపించారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని తెలిపారు.

రైతుబంధు నిధులు పూర్తిస్థాయిలో అందడం లేదని, రుణమాఫీ కూడా అర్హులందరికీ వర్తించలేదని రైతులు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నామని, రుణభారం తగ్గకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైతుల ఆవేదనపై స్పందించిన హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరాతో పచ్చగా కళకళలాడిన పొలాలు నేడు ఎండిపోతున్నాయని ఆరోపించారు. రైతుబంధు, రుణమాఫీ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడమేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు అని ప్రశ్నించారు. పంటలు ఎండిపోయిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతుబంధు నిధులను విడుదల చేసి, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని, అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.
🏠 Home