🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 26 October 2026, 04:10 PM Posted by: MANA VISHWAM

వేటేస్తారా?.. వెనకేసుకొస్తారా?

ఖిలా వరంగల్ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌కు నోటీసులు

ఒకే ఇంటి నంబర్‌తో 12 ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం

సాదాబైనామా కేసు, నాలా అనుమతులపై తీవ్ర సందేహాలు

‘మన విశ్వం’ కథనాలతో కదిలిన స్టాంప్స్ &రిజిస్ట్రేషన్ శాఖ

ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపిన జిల్లా రిజిస్ట్రార్

చర్యలు తీసుకుంటారా?.. వివరణతోనే సరిపెడతారా?

వరంగల్, అక్టోబర్ 26 (మన విశ్వం): ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాదాస్పద రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఇప్పుడు జిల్లా రిజిస్ట్రార్ నిర్ణయంపై ఉత్కంఠ రేపుతోంది. ఒకే ఇంటి నంబర్‌తో 12 ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిర్వహించారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సాదాబైనామా సంబంధిత పత్రాలు, వ్యవసాయ భూముల వ్యవసాయేతర వినియోగ మార్పిడి (నాలా) అనుమతులపై స్పష్టత లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ‘మన విశ్వం’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ శాఖలో కదలిక వచ్చింది. సంబంధిత ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.


ఒకే నంబర్.. 12 రిజిస్ట్రేషన్లు!

2024 నుంచి 2026 మధ్య జరిగిన 12 రిజిస్ట్రేషన్లలో ఒకే ఇంటి నంబర్‌ను వినియోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. వేర్వేరు ప్లాట్లకు ఒకే ఇంటి నంబర్ ఎలా నమోదైంది? రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తుల వివరాలు, సంబంధిత పత్రాలను పరిశీలించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సాదాబైనామా, నాలా అనుమతులకు సంబంధించిన పత్రాలపై స్పష్టత రావాల్సి ఉంది. నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరిగాయా? లేక ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.


నోటీసులతోనే సరిపెడతారా?

‘మన విశ్వం’ కథనాలకు స్పందించిన జిల్లా రిజిస్ట్రార్ ఇప్పటికే సంబంధిత అధికారికి నోటీసులు పంపినట్లు వెల్లడించారు. అయితే నోటీసులకు ఇచ్చే వివరణ, దస్తావేజుల పరిశీలన, తదుపరి శాఖాపరమైన చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? లేక వివరణతోనే వ్యవహారాన్ని ముగిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. దీంతో ఖిలా వరంగల్ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో జిల్లా రిజిస్ట్రార్ తీసుకోబోయే నిర్ణయమే కీలకంగా మారింది.


వివాదంలో ఉన్న 12 దస్తావేజులు

2026: 2064, 2063, 1995, 1254, 1253, 1252, 420, 419, 418
2025: 8923
2024: 1584, 659
🏠 Home