🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 01 October 2026, 05:45 PM Posted by: MANA VISHWAM

అంగన్వాడీ కేంద్రంలో ప్రమాదకర పరిస్థితులు పెచ్చులు ఊడుతున్నా పట్టించుకోరా..?

నాగిరెడ్డిపేట, అక్టోబర్‌ 1 (మన విశ్వం): చిన్నారులకు సురక్షితంగా ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రమే ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మెల్లకుంట తండా గ్రామ పరిధిలోని తాటిచెట్టుగడ్డ తండా అంగన్వాడీ కేంద్రం భవనం పైకప్పు నుంచి సిమెంట్‌ పెచ్చులు ఊడిపడుతున్నాయని చెబుతున్నారు. పైకప్పుపై పగుళ్లు ఏర్పడి, సిమెంట్‌ పొరలు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ చిన్నారులు ఉండే కేంద్రం కావడంతో ఏ సమయంలో పెచ్చులు
ఊడిపడతాయోనన్న ఆందోళన నెలకొంది.
భవనం పరిస్థితి ఇలా ఉన్నా ఇప్పటివరకు మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారులకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


ప్రమాదం జరిగే వరకు వేచి చూడొద్దు..

అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్‌ అధికారులు, అంగన్వాడీ సూపర్‌వైజర్‌, గ్రామపంచాయతీ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. భవనం పరిస్థితిని సాంకేతికంగా తనిఖీ చేసి, ప్రమాదకరంగా ఉన్న భాగాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
🏠 Home