🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 01 October 2026, 11:37 AM Posted by: MANA VISHWAM

నేడు కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ!

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (మన విశ్వం): రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ నివేదిక, పెండింగ్‌ బిల్లులు, హైదరాబాద్‌ మెట్రోతో పాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కేబినెట్‌ తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.
ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న రెండు డీఏల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. డీఏల విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పీఆర్సీ నివేదికతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్‌ డిమాండ్లు, బిల్లుల చెల్లింపులు, ఇతర సమస్యలపైనా మంత్రివర్గం సమాలోచించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మెట్రోపైనా కీలక చర్చ

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం ప్రక్రియ, ఫేజ్‌-2 విస్తరణ అంశాలు కూడా మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫేజ్‌-1 స్వాధీనానికి సంబంధించిన ఆర్థిక అంశాలు, తదుపరి ప్రక్రియతో పాటు ఫేజ్‌-2 విస్తరణకు అవసరమైన నిధులు, అనుమతులు, కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది.


రెవెన్యూ, సాగునీటి అంశాలు

రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, ఇతర పరిపాలనాపరమైన ప్రతిపాదనలపైనా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. వివిధ శాఖల నుంచి వచ్చిన కీలక ప్రతిపాదనలను మంత్రివర్గం పరిశీలించనున్న నేపథ్యంలో నేటి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యంగా రెండు డీఏలు, పీఆర్సీ, పెండింగ్‌ బిల్లుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉద్యోగులు, పెన్షనర్ల దృష్టి కేంద్రీకృతమైంది. సమావేశం అనంతరం వెలువడే అధికారిక నిర్ణయాలతో ఆయా అంశాలపై స్పష్టత రానుంది.
🏠 Home