🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 26 September 2026, 11:57 PM Posted by: MANA VISHWAM

ప్రతి పంచాయతీకి.. సొంత భవనం!

రంగారెడ్డి, సెప్టెంబర్‌ 26 (మన విశ్వం): రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సొంత భవనాలు లేని 5,118 పంచాయతీలకు రూ.1,000 కోట్లతో నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటికే 3,269 భవనాల పనులు 70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన పనులన్నీ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు.
రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి రూ.800 కోట్లు మంజూరు చేశామని, పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. హ్యామ్‌ విధానంలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 3,861 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.3,382 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి మండలంలో ముగ్గురు సభ్యులతో తాగునీటి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు రూ.6 వేల కోట్ల బడ్జెట్‌ అందుబాటులో ఉందని, గ్రామాల్లో మౌలిక వసతులు, నీటి సంరక్షణ పనులకు వినియోగించాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని సీతక్క హెచ్చరించారు. “మంచిగా పనిచేసే అధికారులకు సన్మానాలు.. పనిచేయని అధికారులకు శ్రీముఖాలు” అని స్పష్టం చేశారు.
🏠 Home