🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 22 September 2026, 09:03 PM Posted by: MANA VISHWAM

విమానాశ్రయాల్లో.. తెలంగాణ ముద్ర!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22 (మన విశ్వం): వరంగల్‌, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతీకలుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయాల శిల్ప, వాస్తు కళలను అధ్యయనం చేసి.. వాటి ప్రత్యేకత ప్రతిబింబించేలా విమానాశ్రయాల నిర్మాణ డిజైన్లు ఉండాలని సూచించారు. ఢిల్లీలో నిర్మించే తెలంగాణ భవన్‌కూ ఇదే తరహాలో రాష్ట్ర సాంస్కృతిక ముద్ర ఉండాలని స్పష్టం చేశారు.
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో వరంగల్‌, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్‌ నిర్మాణాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించి పలు మార్పులు సూచించారు.
విమానాశ్రయాల నిర్మాణ ప్రాంతాల్లో విద్యుత్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, తాగునీటి లైన్ల మార్పు, వాగుల ప్రవాహం, రహదారుల మళ్లింపు వంటి పనులను శాఖలవారీగా కాకుండా సమన్వయంతో ఏకకాలంలో చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల కాంపౌండ్‌వాల్‌ సమీపం నుంచి విశాలమైన రహదారులు నిర్మించి జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచించారు.
ప్రస్తుత అవసరాలతోనే సరిపెట్టకుండా భవిష్యత్‌ విస్తరణను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే విమానాశ్రయాల సమీపంలో చెరువులు నిర్మించే అవకాశాన్నీ పరిశీలించాలని సూచించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు.
సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, విప్‌ బీర్ల ఐలయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
🏠 Home