🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 22 September 2026, 05:02 PM Posted by: MANA VISHWAM

ఓయో గదిలో యువతి మృతి.. మిస్టరీ!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22 (మన విశ్వం): మాదాపూర్‌లోని ఓ ఓయో హోటల్‌ గదిలో విశాఖపట్నానికి చెందిన షారన్‌ నిఖిత టోప్నో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఆమె ముఖం, తల భాగంలో గాయాలు ఉండటం, బస చేసిన గదిలో రక్తపు మరకలు కనిపించడంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందన్న కోణంలో మాదాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిఖిత తన స్నేహితుడు శ్రీనివాస రవితేజతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి మాదాపూర్‌ సిద్ధిఖీనగర్‌లోని ఓ హోటల్‌లో బస చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమెను అపస్మారక స్థితిలో కొండాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గదిలో రక్తపు మరకలు
సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌ గదిని పరిశీలించారు. గోడలు, బెడ్‌షీట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించి క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. హోటల్‌లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ యువతి, ఆమెతో వచ్చిన వ్యక్తి కదలికలపై ఆరా తీస్తున్నారు.


రవితేజ కోసం గాలింపు

యువతి మృతి అనంతరం ఆమెతో వచ్చిన రవితేజ పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే యువతి మృతిలో అతడి పాత్రపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ వెలువడలేదు. అతడి వాంగ్మూలం దర్యాప్తులో కీలకంగా మారనుంది.
నిఖితకు గాయాలు ఎలా అయ్యాయి? హోటల్‌ గదిలో ఏం జరిగింది? మృతికి అసలు కారణమేంటి? అనే ప్రశ్నలకు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్‌ ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల పరిశీలనతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🏠 Home