🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 21 September 2026, 06:22 PM Posted by: MANA VISHWAM

పెన్షన్ పనికీ.. రూ.15 వేల లంచం!

నిజామాబాద్, సెప్టెంబర్ 21 (మన విశ్వం): తల్లి నెలవారీ పెన్షన్ మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వ్యక్తి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ పాల్డ అశోక్, ఆడిట్ సెక్షన్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కలకుంట్ల కిరణ్ కుమార్‌లను ఏసీబీ నిజామాబాద్ రేంజ్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపింది.
సోమవారం ఉదయం 11.18 గంటల సమయంలో నిజామాబాద్ పట్టణంలోని రాజా రాజేంద్ర చౌరస్తా సమీపంలోని సీతారాంనగర్ కాలనీ పద్మశాలి సంఘం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిర్యాదుదారుడి తల్లికి నెలవారీ పెన్షన్ మంజూరు చేసేందుకు అవసరమైన ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేయడంతోపాటు సర్వీస్ బుక్‌లో అవసరమైన ఎంట్రీలు, ఇతర వివరాలు నమోదు చేసేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ పేర్కొంది.
ఇద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల రెండో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో హాజరుపరిచే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. భద్రతా కారణాలతో ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచింది.

🏠 Home