🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 21 September 2026, 04:06 PM Posted by: MANA VISHWAM

లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షల చేయూత

హనుమకొండ, సెప్టెంబర్‌ 21 (మన విశ్వం): తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, పుష్పలత దంపతుల కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
హనుమకొండ శాంతినగర్‌, పోస్టల్‌ కాలనీకి చెందిన కేదారి దంపతులు సాధారణ హోటల్‌ నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీ అందించారు. ‘అన్నం వృథా చేయొద్దు’ అంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. వారి ఉద్యమ సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు.
కేదారి సెప్టెంబర్‌ 9న, పుష్పలత సెప్టెంబర్‌ 10న విషాదకర ఘటనలో మృతి చెందారు. దీంతో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.10 లక్షల సాయం మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులకు అందించేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు.
🏠 Home