🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 17 September 2026, 08:54 AM Posted by: MANA VISHWAM

లంచం కేసులో సీఐ.. ఎస్సై అరెస్ట్‌!

లంచం వ్యవహారంలో కీసర పోలీస్‌స్టేషన్‌ సీఐ, ఎస్సై అరెస్టు కావడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఓ కేసులో నిందితుడికి బెయిల్‌ విషయంలో సహకరించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఎస్సైని పట్టుకున్నారు. అనంతరం సీఐని కూడా అరెస్ట్‌ చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఓ కేసులో నిందితుడికి బెయిల్‌ విషయంలో సహకరించేందుకు సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణ. అంతేకాకుండా కొన్నిరోజులుగా బాధితుడితో బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తెప్పిస్తూ ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. వేధింపులు భరించలేక బాధితుడు చివరకు ఏసీబీని ఆశ్రయించాడు.
ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. లంచం మొత్తంలో రూ.5 లక్షలు తీసుకునే బాధ్యతను ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం విధుల్లో ఉన్న ఎస్సై డబ్బులు తీసుకుంటున్న సమయంలో డీఎస్పీ మజీద్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం దాడి చేసింది.
ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై అక్కడి నుంచి పరుగులు తీసినట్లు సమాచారం. అనంతరం కెమికల్‌ పరీక్షలకు సైతం సహకరించకుండా అధికారులను ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలిసింది. చివరకు ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఏసీబీ చర్యలు కీసర పోలీస్‌స్టేషన్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి.
🏠 Home