🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 15 September 2026, 05:28 PM Posted by: MANA VISHWAM

రోడ్డుపాలవుతున్న ఆర్టీసీ టికెట్‌ రోల్స్‌!

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌ 15 (మన విశ్వం): ప్రయాణికుడికి టికెట్‌ ఇచ్చేందుకు కండక్టర్‌ చేతిలో ఉండాల్సిన ఆర్టీసీ టికెట్‌ పేపర్‌ రోల్స్‌.. రోడ్లపై కనిపిస్తుండటం ఆదిలాబాద్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బస్సుల్లో రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన ఈ సామగ్రి నిర్మల్‌ ఘాట్‌ రోడ్డు, నేరేడిగొండ టోల్‌ప్లాజా, బోథ్‌ ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో పడివున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్‌ పేపర్‌ అవసరం కూడా పెరుగుతుంది. అవసరాన్ని బట్టి డిపోల నుంచి అదనపు రోల్స్‌ను కండక్టర్లకు అందిస్తుంటారు. అలాంటి టికెట్‌ రోల్స్‌ రోడ్లపైకి ఎలా వస్తున్నాయన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఒక్కో రోల్‌కు సుమారు రూ.25 వరకు వ్యయం ఉంటుందని సిబ్బంది వర్గాల అంచనా. ఒక్క రోల్‌ విలువ తక్కువగానే కనిపించినా.. రోజూ అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో వృథా జరుగుతుంటే మొత్తం మీద ప్రజాధనానికి నష్టం తప్పదని ప్రయాణికులు అంటున్నారు. అంతేకాకుండా అవసరమైన సమయంలో టికెట్‌ పేపర్‌ లేకపోతే కండక్టర్లకు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
రోడ్లపై కనిపిస్తున్న రోల్స్‌ వినియోగించని కొత్తవా? కొంత వినియోగించిన తర్వాత మిగిలినవా? అవి అక్కడికి ఎలా చేరాయి? అనే విషయాలపై సంబంధిత డిపో అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసే ప్రతి వస్తువూ ప్రభుత్వ ఆస్తేనని, చిన్న మొత్తమనే భావనతో నిర్లక్ష్యం చేయకుండా టికెట్‌ రోల్స్‌ వినియోగం, పంపిణీపై పర్యవేక్షణ పెంచాలని సూచిస్తున్నారు.
🏠 Home