🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 14 September 2026, 02:09 PM Posted by: MANA VISHWAM

78 ఏళ్లుగా నిమజ్జనం కాని గణపయ్య!

పాలజ్‌లో అపురూప ‘కర్ర గణేశుడు’.. నేడు ఘనంగా ఉత్సవాలకు శ్రీకారం

అంటువ్యాధుల నుంచి కాపాడాడన్న గ్రామస్తుల విశ్వాసం

1948లో కర్రతో తయారైన విగ్రహం.. అప్పటి నుంచి అదే గణపతికి పూజలు

నిమజ్జనం బదులు వాగు నీటితో అభిషేకం.. మళ్లీ ప్రత్యేక గదిలో భద్రం

తెలంగాణ–మహారాష్ట్ర నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు


గౌతమ్ వాగ్మారె, ముధోల్ ఆర్సీ రిపోర్టర్ (మన విశ్వం): వినాయక చవితి వచ్చిందంటే కొత్త విగ్రహం ప్రతిష్ఠించడం.. ఉత్సవాల అనంతరం నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కానీ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని పాలజ్‌లో మాత్రం కథే వేరు! ఇక్కడ 1948లో తయారైన కర్ర గణపతినే నేటికీ భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. 78 ఏళ్లుగా ఈ గణనాథుడిని నిమజ్జనం చేయకుండా ఏటా తిరిగి ప్రతిష్ఠించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. నేడు వినాయక చవితి సందర్భంగా మరోసారి కర్ర గణేశుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
పాలజ్‌లో 1948లో అంటువ్యాధులు ప్రబలి సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ సమయంలో మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని వినాయకుడిని ప్రతిష్ఠించాలని పెద్దలు నిర్ణయించారట. నిర్మల్‌కు చెందిన కళాకారుడు పాలకొండ గుండాజీ వర్మతో కర్ర గణపతి విగ్రహాన్ని తయారు చేయించి గ్రామంలో ప్రతిష్ఠించారు. అనంతరం వ్యాధుల తీవ్రత తగ్గిందని, అప్పటి నుంచి ఈ గణపతిపై గ్రామస్తులకు అపారమైన విశ్వాసం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.
అప్పటి నుంచి ప్రతి వినాయక చవితికి అదే కర్ర గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల చివరి రోజున స్వామివారిని గ్రామ సమీపంలోని వాగు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి, వాగు నీటిని విగ్రహంపై చల్లుతారు. అనంతరం తిరిగి తీసుకొచ్చి ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. గ్రామంలో ప్రతిష్ఠించే మట్టి గణేశుడిని మాత్రమే నిమజ్జనం చేస్తారు.


కోరిన కోరికలు తీర్చే గణపయ్య!

కర్ర గణేశుడిని దర్శించుకుని మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. భక్తులు స్వామివారికి ముడుపులు కట్టి, కోరిక నెరవేరిన తర్వాతి ఏడాది వచ్చి వాటిని విప్పి మొక్కులు చెల్లించుకుంటారు. 11 రోజుల ఉత్సవాల సమయంలో గ్రామస్తులు నియమనిష్ఠలతో ఉండటంతో పాటు ప్రత్యేక గణేశ్ దీక్షలు చేపడతారు. మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ అన్నదానం, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రత్యేక పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేసింది. పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. మహారాష్ట్రలో ఉన్నప్పటికీ పాలజ్ గ్రామ ప్రజల భాష, బంధుత్వాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలంగాణతో బలంగా ముడిపడి ఉండటం మరో ప్రత్యేకత.


పాలజ్‌కు వెళ్లాలంటే..

హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు నిజామాబాద్–బాసర మీదుగా భైంసా చేరుకుని పాలజ్ వెళ్లవచ్చు. నిర్మల్ వైపు నుంచి వచ్చేవారు కూడా భైంసా మీదుగానే వెళ్లాలి. భైంసా నుంచి పాలజ్ సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా భైంసా డిపో నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
🏠 Home