🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 12 September 2026, 11:57 AM Posted by: MANA VISHWAM

పంచాయతీ మోటారు.. ఎవరు అమ్మేశారు?

నల్లబెల్లి, సెప్టెంబర్‌ 12 (మన విశ్వం): గ్రామానికి తాగునీరు అందించిన పంచాయతీ మోటారు ఏమైంది?.. రిపేర్‌కు ఇచ్చిన మోటారు ఎవరి చేతుల్లోకి వెళ్లింది?.. లెంకలపల్లి గ్రామంలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. గ్రామపంచాయతీకి చెందిన 5 హెచ్‌పీ విద్యుత్‌ మోటారును విక్రయించారంటూ ఉపసర్పంచ్‌ కోలిపాక రఘుపతి, కాంగ్రెస్‌ గ్రామ పార్టీ అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.
గ్రామంలోని రెండు నల్లాల బావుల ద్వారా తాగునీటి సరఫరాకు సీఆర్‌ఐ కంపెనీకి చెందిన 5 హెచ్‌పీ మోటారును వినియోగించేవారని వారు తెలిపారు. మరమ్మతుల కోసం దానిని గ్రామంలోని కీసరి నాగరాజు రిపేర్‌ షాపులో ఉంచారని చెప్పారు. అనంతరం సుమారు ఎనిమిది నెలల క్రితం 7.45 హెచ్‌పీ సామర్థ్యంతో కొత్త మోటారు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
అయితే పాత మోటారు ప్రస్తుతం ఎక్కడ ఉందనే దానిపై స్పష్టత లేదని ఆరోపించారు. సర్పంచ్‌ కస్తూరి విజయలక్ష్మి భర్త రవీందర్‌ ఆ మోటారును తన స్నేహితుడి కుమారుడికి విక్రయించారని వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఎనిమిది నెలలుగా ప్రశ్నిస్తున్నా సరైన సమాధానం రావడం లేదని పేర్కొన్నారు.
పంచాయతీ ఆస్తి నిజంగా విక్రయించారా?.. విక్రయిస్తే ఎవరి అనుమతితో?.. వచ్చిన సొమ్ము ఏమైంది?.. అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఈ సమావేశంలో వార్డు సభ్యులు కందికొండ కృష్ణ, సింగిరెడ్డి రవి, గాదం లలితా కుమారస్వామి, కాంగ్రెస్‌ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు కోమండ్ల రాముష్‌, నాయకులు నుటెంకి మొగిలి, నాన్నబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఆరోపణలపై సర్పంచ్‌ కస్తూరి విజయలక్ష్మి లేదా ఆమె భర్త రవీందర్‌ స్పందన అందాల్సి ఉంది.
🏠 Home