🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 11 September 2026, 06:43 PM Posted by: MANA VISHWAM

ఏఎంఆర్‌పై ఈడీ సోదాలు!

ప్రముఖ మైనింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఏఎంఆర్‌ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. SREI గ్రూప్‌ సంస్థల రుణ లావాదేవీలపై కొనసాగుతున్న మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఏఎంఆర్‌ ఇండియా కార్యాలయంలో కోల్‌కతా ఈడీ యూనిట్‌కు చెందిన బృందాలు ఆర్థిక రికార్డులను పరిశీలించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోనూ సంబంధిత సంస్థలకు చెందిన ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్లు సమాచారం. SREI Infrastructure Finance Limited, SREI Equipment Finance Limited నుంచి మంజూరైన రుణాలు, వాటి వినియోగం, తిరిగి చెల్లింపులు, సంబంధిత సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


రుణాల లెక్కలపై ఆరా

రుణాల ‘ఎవరగ్రీనింగ్‌’ జరిగిందా? నిధులు ఇతర అవసరాలకు మళ్లాయా? సంస్థల మధ్య లావాదేవీల్లో ‘రౌండ్‌ ట్రిప్పింగ్‌’కు సంబంధించిన అంశాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ అంశాల్లో ఏఎంఆర్‌పై అక్రమాలు నిర్ధారణ అయినట్లు ఈడీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఏఎంఆర్‌–SREI మధ్య ఆర్థిక వివాదం గతంలో ఆర్బిట్రేషన్‌కు చేరింది. కోర్టు రికార్డుల ప్రకారం తనకు రూ.586.03 కోట్లకుపైగా రావాల్సి ఉందని SREI క్లెయిమ్‌ చేయగా, తమకు నష్టం వాటిల్లిందంటూ ఏఎంఆర్‌ సుమారు రూ.739.40 కోట్ల కౌంటర్‌ క్లెయిమ్‌ చేసింది. ఇవి ఇరుపక్షాల క్లెయిమ్‌లు మాత్రమే తప్ప నిర్ధారిత అక్రమ మొత్తాలు కావు.


ఈడీ ప్రకటనతోనే క్లారిటీ

తాజా సోదాల్లో ఏవైనా పత్రాలు, నగదు లేదా డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారా? నిర్దిష్ట లావాదేవీలను గుర్తించారా? అనే వివరాలను ఈడీ ఇంకా పూర్తిస్థాయిలో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సోదాల్లో సేకరించిన రికార్డుల పరిశీలన, తదుపరి దర్యాప్తు తర్వాతే ఏఎంఆర్‌కు సంబంధించిన లావాదేవీలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
🏠 Home