🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 10 September 2026, 09:20 PM Posted by: MANA VISHWAM

బీసీల లెక్కకు.. ప్రత్యేక కాలమ్‌ పెట్టాలి!

దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయిని భరత్‌ డిమాండ్‌ చేశారు. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేందుకు జనగణనలో ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేయాలని, ఇందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బీసీల జనాభా ఎంత?.. ఏ కులం ఎంతమంది ఉన్నారు?.. వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై దేశవ్యాప్తంగా సమగ్రమైన అధికారిక గణాంకాలు అవసరమని నాయిని భరత్‌ పేర్కొన్నారు. కచ్చితమైన లెక్కలు లేకుండా బీసీలకు జనాభాకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు, విద్య–ఉపాధి అవకాశాలు అందించడం సాధ్యం కాదన్నారు. అందుకే ఓబీసీ కాలమ్‌ ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో చేపట్టిన కులగణన అనుభవాన్ని దేశవ్యాప్త జనగణనలోనూ ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఓబీసీలను ఒకే వర్గంగా లెక్కించడం కాకుండా కులాల వారీగా వివరాలు నమోదు చేయాలని, ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల ఏ వర్గం ఎంత వెనుకబడి ఉంది, ఎవరికి ప్రభుత్వ సహాయం ఎక్కువగా అవసరం ఉందనే అంశాలపై స్పష్టత వస్తుందన్నారు.
బీసీలకు న్యాయం చేస్తామని చెప్పడం మాత్రమే సరిపోదని, వారి వాస్తవ జనాభాను అధికారికంగా గుర్తించడం నుంచే సామాజిక న్యాయం ప్రారంభం కావాలని నాయిని భరత్‌ పేర్కొన్నారు. జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు రూపొందించాలంటే సమగ్ర గణాంకాలే ప్రాతిపదిక కావాలన్నారు.
సంచార జాతుల సమస్యలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. స్థిర నివాసం, విద్య, ఉపాధి, సామాజిక భద్రత విషయంలో ఇప్పటికీ అనేక కుటుంబాలు వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో చేరేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఓబీసీ ప్రత్యేక కాలమ్‌పై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేయాలని నాయిని భరత్‌ కోరారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపి దేశవ్యాప్త జనగణనలో బీసీలకు ప్రత్యేక గుర్తింపు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని స్పష్టం చేశారు. ‘‘బీసీల సంఖ్య తేలాలి.. వారి స్థితిగతులు తెలియాలి.. అప్పుడే వాటా, సంక్షేమం, అవకాశాల్లో నిజమైన న్యాయం సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు.
🏠 Home