🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 09 September 2026, 10:13 PM Posted by: MANA VISHWAM

కానిస్టేబుల్‌ వయోపరిమితి మరో మూడేళ్లు పెంపు!

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పోలీస్‌, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) విభాగాల్లో కానిస్టేబుల్‌, సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జీవో ఎంఎస్‌ నం.129 విడుదల చేశారు.
యూనిఫాం సర్వీసుల్లో వివిధ పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు ప్రభుత్వం గతంలో గరిష్ఠ వయోపరిమితిపై ఏడేళ్ల సడలింపు కల్పించింది. అయితే పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు, కానిస్టేబుల్‌ పోస్టులకు 29 ఏళ్లుగా ఉండటంతో మూడేళ్ల వ్యత్యాసం ఉన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలించింది.
ఏడేళ్లకు మరో మూడేళ్లు
ఈ వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టే నియామకాల్లో కానిస్టేబుల్‌, సమాన పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల వయోసడలింపునకు అదనంగా మరో మూడేళ్లు పెంచాలని నిర్ణయించింది. దీంతో అర్హత కోల్పోతామన్న ఆందోళనలో ఉన్న పలువురు అభ్యర్థులకు మరో అవకాశం లభించనుంది.
ఈ అదనపు వయోసడలింపు పోలీస్‌, ఫైర్‌ సర్వీసెస్‌, ప్రిజన్స్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లోని కానిస్టేబుల్‌, సమాన పోస్టులకు వర్తించనుంది. అయితే పోలీస్‌ శాఖలోని పీసీ డ్రైవర్‌ పోస్టులను ప్రభుత్వం ఈ సడలింపు నుంచి మినహాయించింది.
ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సవరించిన నిబంధనలను తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించనున్నారు. తాజా నియామకాల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వయోపరిమితిపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభ్యర్థులకు కీలక ఊరటగా మారింది.
🏠 Home