🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 09 September 2026, 07:42 PM Posted by: MANA VISHWAM

స్పీకర్‌ను అవమానించిన వారిని వదలం!

శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజైన సెప్టెంబర్‌ 6న చోటుచేసుకున్న ఘటనలపై ప్రభుత్వం కఠిన వైఖరి ప్రకటించింది. సంఘటనల వెనుక ఎవరున్నా సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సభాపతిని, ఆయన తల్లిని అవమానించేలా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో స్పీకర్‌కు ప్రభుత్వం, శాసనసభ అండగా నిలుస్తాయని చెప్పారు.
బుధవారం శాసనసభలో ఈ అంశంపై జరిగిన సుదీర్ఘ చర్చకు సభానాయకుడిగా సీఎం సమాధానమిచ్చారు. సెప్టెంబర్‌ 6న జరిగిన ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. కొందరు ఉసిగొల్పబడిన వ్యక్తులు అధికారులపై దాడులకు పాల్పడటంతోపాటు సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు. సభాపతి తల్లిని కించపరిచేలా మాట్లాడటం అత్యంత దారుణమన్నారు. ఇది ఆకస్మికంగా జరిగిన ఘటన కాదని, ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా అభివర్ణించారు.
‘సభాపతికి అవమానం.. సమాజానికే అవమానం’
మహిళను శక్తికి, గొప్పతనానికి ప్రతీకగా చూసే సంస్కృతి మనదని సీఎం పేర్కొన్నారు. దేశాన్ని భారతమాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా గౌరవించే నేలపై ఒక తల్లిని అవమానించేలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. సభాపతికి జరిగిన అవమానాన్ని తెలంగాణ సమాజానికి జరిగిన అవమానంగానే చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, వ్యక్తిగతంగా మనసును గాయపరిచే వ్యాఖ్యలకు చోటుండకూడదన్నారు.
‘ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్నాం’
సెప్టెంబర్‌ 7 నుంచి సభలో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావించిందని సీఎం చెప్పారు. విద్యారంగ సమస్యలు, ధరణి అక్రమాలు, 22(ఎ) భూములతోపాటు ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలనూ చర్చకు తీసుకురావాలని సిద్ధమయ్యామని తెలిపారు. అయితే ప్రజా సమస్యలపై చర్చ ముందుకు సాగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
సెప్టెంబర్‌ 6 ఘటనల్లో బాధ్యులు ఎవరన్నది విచారణలో తేల్చి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సభాపతి మనోధైర్యం కోల్పోవద్దని కోరుతూ.. ఆయన గౌరవాన్ని కాపాడే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని తేల్చిచెప్పారు.
🏠 Home