🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 09 September 2026, 06:31 PM Posted by: MANA VISHWAM

ఉద్యోగం ఆశ చూపి.. రూ.85 లక్షలకు టోకరా!

ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగ యువతను నిలువునా ముంచిన భారీ మోసం కాజీపేటలో వెలుగుచూసింది. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు రూ.85 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మెట్టు ప్రవీణ్‌కుమార్‌ (41)ను అరెస్ట్‌ చేశారు.
స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ కోటా, బ్యాక్‌డోర్‌ రిక్రూట్‌మెంట్‌ పేరుతో అభ్యర్థులను నమ్మించిన నిందితుడు.. పాత నియామక ఉత్తర్వుల్లో పేర్లు మార్చి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు, మెమోరాండంలు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానం రాకుండా మెడికల్‌ టెస్టులు, పోలీస్‌ వెరిఫికేషన్‌ జరుగుతున్నట్లు నమ్మించడంతోపాటు కొన్ని కోర్సులను ఉద్యోగ శిక్షణగా చూపించినట్లు దర్యాప్తులో తేలింది. పలువురి అసలు విద్యా సర్టిఫికెట్లను కూడా తీసుకున్నట్లు గుర్తించారు.
నిందితుడి నుంచి రూ.18.22 లక్షల విలువైన నగదు, ఇతర ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బ్రెజ్జా కారు, రూ.2 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌, ఇతర ఫోన్లు, బాధితుల అసలు సర్టిఫికెట్లు, నకిలీ నియామక ఉత్తర్వుల తయారీకి ఉపయోగించిన సామగ్రి ఉన్నాయి.
కాజీపేట ఏసీపీ పి.ప్రశాంత్‌రెడ్డి ఆదేశాలతో, ఎస్‌హెచ్‌వో జె.శ్యామ్‌సుందర్‌ పర్యవేక్షణలో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? ఇంకా ఎంతమంది బాధితులయ్యారు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. "ప్రభుత్వ ఉద్యోగానికి షార్ట్కట్ లేదు.. ఉద్యోగం పేరుతో డబ్బులు అడిగేవారిని నమ్మొద్దు " అని పోలీసులు హెచ్చరించారు.
🏠 Home