🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 08 September 2026, 03:29 PM Posted by: MANA VISHWAM

సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలి!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (మన విశ్వం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు అనుచితంగా, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఫిర్యాదులో కోరినట్లు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
రాజకీయంగా విమర్శలు, విభేదాలు ఉండవచ్చని.. అయితే వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ప్రవీణ్‌కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పలువురు బీఆర్‌ఎస్‌, మహిళా విభాగం నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
🏠 Home