🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 08 September 2026, 02:05 PM Posted by: MANA VISHWAM

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు కొత్త బాస్‌!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (మన విశ్వం): తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (టీజీపీసీబీ)కి కొత్త బాస్‌ వచ్చారు. బోర్డు చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి రాజా శేఖర్‌రెడ్డి లక్కాడిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి మూడేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది.
పర్యావరణ పరిరక్షణ రంగంలో రాజా శేఖర్‌రెడ్డికి ఉన్న ప్రత్యేక పరిజ్ఞానం, ఆచరణాత్మక అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ సెప్టెంబర్‌ 7న జీవో ఎంఎస్‌ నం.33 జారీ చేసింది.
గతంలో 2024 మార్చి 7న జారీ చేసిన జీవో నం.9 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చైర్మన్‌గా పేర్కొంటూ తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ఏర్పాటు చేశారు. తాజాగా ఆ ఉత్తర్వులను పాక్షికంగా సవరించి రాజా శేఖర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించారు. నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం–1974 నిబంధనల మేరకు ఈ నియామకం చేపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.

🏠 Home