🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 08 September 2026, 12:00 AM Posted by: MANA VISHWAM

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు ముందడుగు!

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్‌ 7 (మన విశ్వం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ప్రతిపాదిత ప్రాంతాల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు భారత విమానాశ్రయాల సంస్థకు చెందిన బహుళ విభాగాల సాంకేతిక బృందం జిల్లాలో క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టింది.
భారత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సీతంపేట, సుజాతనగర్‌, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాల్వంచ, దమ్మపేట, పెనగడప ప్రాంతాలను పరిశీలించింది. భూమి లభ్యత, విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రన్‌వే నిర్మాణానికి అనుకూలత, రహదారి అనుసంధానం, భవిష్యత్‌లో విమానాశ్రయ విస్తరణ అవకాశాలపై వివరాలు సేకరించింది.
చిన్న విమానాలతో పాటు పెద్ద ప్రయాణికుల విమానాలు దిగేందుకు అవసరమైన పొడవైన రన్‌వే, భద్రతా ప్రమాణాలు, రాత్రివేళ విమానాల రాకపోకలకు కావాల్సిన సదుపాయాలపైనా అధ్యయనం చేస్తోంది. ప్రతిపాదిత ప్రాంతాల సమీపంలోని విద్యుదీకరించిన బొగ్గు రవాణా రైల్వే మార్గం విమానాల కార్యకలాపాలపై చూపే ప్రభావాన్నీ పరిశీలిస్తోంది.
సింగరేణి అతిథి గృహంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ అంకిత్‌తో సాంకేతిక బృందం సమావేశమైంది. అవసరమైన భూ రికార్డులు, సర్వే మ్యాపులు, ఇతర వివరాలను జిల్లా యంత్రాంగం అందించింది. విమానాశ్రయం ఏర్పాటైతే పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. రెండు రోజుల పరిశీలన అనంతరం బృందం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగానే విమానాశ్రయ ఏర్పాటుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
🏠 Home