🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 03 September 2026, 10:48 PM Posted by: MANA VISHWAM

22ఏ నుంచి పేదల భూములు తొలగించాల్సిందే

22ఏ నిషేధిత జాబితాలో చిక్కుకున్న పేద, మధ్యతరగతి ప్రజల భూములు, ఇళ్లకు వెంటనే విముక్తి కల్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. ‘భూభారతి పేరుతో భూహారతి చేస్తున్నారు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
22ఏ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంత ఆస్తులపైనే హక్కులు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఈటల పేర్కొన్నారు. భూములు, ఇళ్లు విక్రయించుకోలేకపోవడంతో పాటు వాటిపై బ్యాంకు రుణాలు కూడా పొందలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది ఈ సమస్యతో ప్రభావితమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గం ‘మినీ ఇండియా’గా పేరొందిందని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారని తెలిపారు. వందలాది కాలనీలను 22ఏ పరిధిలోకి తీసుకురావడంతో ఆస్తి యజమానులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పీ అండ్‌ టీ కాలనీ, మహేంద్రహిల్స్‌ వంటి ప్రాంతాలు సైతం నిషేధిత జాబితాలో ఉండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు.
22ఏ చట్టాన్నే పూర్తిగా రద్దు చేయాలని తాము కోరడం లేదని ఈటల స్పష్టం చేశారు. ప్రభుత్వ, వివాదాస్పద భూముల విషయంలో చట్టం అమలు చేయవచ్చని, ఏళ్ల తరబడి నివాసముంటూ హక్కులు కలిగిన పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులను మాత్రం నిషేధిత జాబితాలో ఉంచడం సరికాదన్నారు. అర్హులైన వారి భూములు, ఇళ్లను గుర్తించి వెంటనే 22ఏ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
అధికారుల తప్పిదాల వల్ల ప్రజల ఆస్తులు జాబితాలో చేరితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్ణయమే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే పాలకులు బాధ్యత వహించాలని అన్నారు. ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మాటలతో కాలయాపన చేయకుండా 22ఏ అంశంపై సమగ్ర సమీక్ష నిర్వహించి బాధితులకు స్పష్టమైన పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే 22ఏ బాధితుల తరఫున బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఈటల హెచ్చరించారు. ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దీక్షలు చేపడతామని ప్రకటించారు. బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ హక్కుల కోసం గళమెత్తాలని పిలుపునిచ్చారు.
🏠 Home