ప్రైవేటు భూమైతే వెంటనే రిజిస్ట్రేషన్
స్లాట్ తీసుకున్న వారి భూములపై 48 గంటల్లో పరిశీలన
జాబితాను జల్లెడ పట్టి తప్పులు సరిదిద్దాలి
కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
‘ఒక్క అంగుళం ప్రైవేటు భూమికీ ఇబ్బంది రానివ్వం’
హైదరాబాద్, ఆగస్టు 18 (మన విశ్వం): 22-ఏ నిషేధిత జాబితాలో పొరపాటున ప్రైవేటు భూములు చేరి ఉంటే.. వాటి రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తి 22-ఏ జాబితాలో ఉంటే రెండు రోజుల్లోనే పరిశీలించి.. ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు.
22-ఏ భూముల రిజిస్ట్రేషన్లపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం మంగళవారం సమీక్షించారు. ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు.
జాబితాపై కలెక్టర్ల ‘జల్లెడ’
జిల్లాల వారీగా 22-ఏ జాబితాలోని భూములను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. అర్హమైన ప్రైవేటు భూములకు ఇబ్బందులు తలెత్తకుండా, తప్పులకు తావులేని జాబితాను రూపొందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
దళారుల మాట నమ్మొద్దు
‘‘ప్రజలు తమ భూ హక్కులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రైవేట్ భూమిలో ఒక్క అంగుళానికీ ఇబ్బంది రానివ్వం. ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని సీఎం స్పష్టం చేశారు. 22-ఏ పేరుతో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, పుకార్లు.. కట్టుకథలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.