🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 02 August 2026, 11:14 PM Posted by: MANA VISHWAM

బోనాలకు రూ.20 కోట్లు.. రంజాన్‌కు రూ.33 కోట్లు ఎందుకు?

హిందూ ఉత్సవాలకు నిధులు పెంచాలి: బండి సంజయ్

రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శ

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో వ్యాఖ్యలు

రాష్ట్రంలో హిందూ పండుగలు, ముఖ్యంగా బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రంజాన్ పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయిస్తుండగా, బోనాల వంటి రాష్ట్ర పండుగకు కేవలం రూ.20 కోట్లే కేటాయించడం సమంజసం కాదని ఆయన అన్నారు. జంట నగరాల్లోనే మూడు వేలకుపైగా దేవాలయాలు ఉన్న నేపథ్యంలో ఈ నిధులు ఏమాత్రం సరిపోవని పేర్కొన్నారు. హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటికీ, ఆ స్థాయికి తగిన విధంగా నిధులు, సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. హిందువులు తమ ఉత్సవాల నిర్వహణ కోసం బిక్షమెత్తుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగిందని ఆయన ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన అన్ని మతాల పండుగలకు సముచితంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. హిందూ పండుగల పట్ల ప్రభుత్వం చులకన వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, హిందూ సమాజం తమ హక్కుల పరిరక్షణ కోసం మరింత జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
🏠 Home