🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 27 July 2026, 05:54 PM Posted by: MANA VISHWAM

ఏం చేస్తారో చేయండి... మా పెద్దిని కాపాడండి!

యశోద వైద్యులకు కేసీఆర్ వేడుకోలు

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా

కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత

మరో 48 గంటల తర్వాతే స్పష్టత: వైద్యులు

ప్రపంచస్థాయి చికిత్స అందిస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, జూలై 27 (మన విశ్వం): తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో సుదీర్ఘంగా చర్చించి చికిత్స వివరాలు తెలుసుకున్న ఆయన, "ఏం చేస్తారో చేయండి... మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి" అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ వైద్యులను వేడుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
దాదాపు 45 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్, ఐసీయూలో చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులతో కలిసి చికిత్స విధానంపై సమగ్రంగా ఆరా తీశారు. అవసరమైన ఏ సహాయం కావాలన్నా పార్టీ తరఫున అందిస్తామని, ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
వైద్యులు కేసీఆర్‌కు వివరాలు తెలియజేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచస్థాయి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అవసరమైతే విదేశాల్లోని నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నామని చెప్పారు. గుండె, ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు స్పందిస్తున్నప్పటికీ, మెదడు పూర్తిగా స్పందించడానికి మరో 48 గంటలు పట్టే అవకాశం ఉందని వివరించారు. పూర్తి స్థాయి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం అవసరమని పేర్కొన్నారు.
వైద్యుల వివరాలు విన్న అనంతరం కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్టతో పాటు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. "దేవుడి దయ, వైద్యుల కృషి, ప్రజల ఆశీస్సులతో ఆయన కోలుకుంటారు. ధైర్యంగా ఉండండి" అంటూ వారికి భరోసా కల్పించారు. అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ వెంట ఉన్నారు.

🏠 Home