🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 24 July 2026, 09:09 AM Posted by: MANA VISHWAM

ప్రశ్నపత్రాల లీక్‌లపై దేశం రగిలింది!

రాజీనామా డిమాండ్‌తో వీధుల్లోకి విద్యార్థులు.. దేశవ్యాప్తంగా ఉధృతమైన ఆందోళనలు

ఆందోళనకారులపై లాఠీచార్జీలతో ఉద్రిక్త పరిస్థితులు

సీజెపి, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో మరింత విస్తరిస్తున్న ఉద్యమం

'రాజీనామా వరకు పోరాటం ఆగదు' అంటూ విద్యార్థి సంఘాల హెచ్చరిక

ప్రత్యేక ప్రతినిధి, (మన విశ్వం): దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర రాజకీయ, సామాజిక దుమారం రేపుతోంది. పరీక్షల పారదర్శకత దెబ్బతినడంతో లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి.
రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్ర రాజధానుల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పలుచోట్ల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించగా, కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జీలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి.
ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్‌పై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి.
ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజెపి) తో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదు" అని సీజెపి నాయకులు, విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.
దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రతిపక్షాల మద్దతుతో ఈ ఉద్యమం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది.
🏠 Home