🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 05 July 2026, 10:29 AM Posted by: MANA VISHWAM

​ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందే బెదిరింపులు!

'మెల్‌బోర్న్ మీట్స్ మోదీ' ఈవెంట్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్

​రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ .. పలు కోణాల్లో దర్యాప్తు

​భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే ఆస్ట్రేలియా పర్యటనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయి బెదిరింపులు రావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. జూలై 9న మెల్‌బోర్న్‌లోని ప్రసిద్ధ మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించాల్సిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కమ్యూనిటీ ఈవెంట్‌ను టార్గెట్ చేస్తూ ఒక ఆగంతకుడు ఫేస్‌బుక్‌లో హెచ్చరికలు జారీ చేశాడు.

​రూఫ్ టాప్ క్లోజ్ చేయకపోతే అంతే..!

​ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఫేస్‌బుక్ ప్రకటన కింద 'అబు ముస్తఫా' అనే పేరుతో ఉన్న ఖాతా నుండి ఒక ప్రమాదకరమైన కామెంట్ ప్రత్యక్షమైంది.
​"ఈ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం రూఫ్ టాప్‌లను (పైకప్పును) మూసివేయడం మంచిది. లేదంటే ఆయన (ప్రధాని మోదీ) తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు లెక్క" అంటూ సదరు ఖాతాదారుడు బహిరంగంగానే ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు దిగాడు.

​ఈ తీవ్రమైన ఉదంతంపై ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'ది ఆస్ట్రేలియా టుడే' ప్రతినిధులు స్పందిస్తూ, ఈ బెదిరింపులపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కి ఇప్పటికే అధికారికంగా ఫిర్యాదు అందినట్లు స్పష్టం చేశారు.

​ఐపీ అడ్రస్ గుర్తింపు.. దర్యాప్తు ముమ్మరం

​ఈ వ్యవహారాన్ని ఆస్ట్రేలియా భద్రతా విభాగాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వివాదాస్పద పోస్ట్ పెట్టిన నిందితుడిని పట్టుకునేందుకు ఆ దేశ రాష్ట్ర అధికారులు రంగంలోకి దిగారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ కామెంట్ పోస్ట్ చేసిన లొకేషన్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్ ను అధికారులు విజయవంతంగా తెలిసింది. ఈ బెదిరింపుల వెనుక ఉన్న శక్తులెవరు? దీని వెనుక ఏదైనా ఉగ్రకోణం ఉందా? అనే పలు అంశాలపై దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరుపుతున్నాయి.

​అప్రమత్తమైన భద్రతా సంస్థలు

​విదేశీ ప్రభుత్వాధినేతలకు వచ్చే ఇటువంటి బెదిరింపులను ఆస్ట్రేలియా చట్టం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హై-ప్రొఫైల్ అంతర్జాతీయ పర్యటనకు ఎలాంటి విఘాతం కలగకుండా భద్రతా ప్రణాళికను మరింత కట్టుదిట్టం చేశారు.​ఈ భద్రతా వ్యూహంలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్, స్టేట్ పోలీస్, మరియు స్పెషల్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ యూనిట్లతో సహా పలు అగ్రశ్రేణి భద్రతా సంస్థలు భాగస్వామ్యమై జల్లెడ పడుతున్నాయి.


​యథాతథంగానే పర్యటన..

​బెదిరింపులు వచ్చినప్పటికీ ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు, ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ సమావేశంతో సహా పలు ఇతర అంతర్జాతీయ సమ్మిట్లలో కూడా చురుగ్గా పాల్గొననున్నారు. ఈ పర్యటనపై ఇరు దేశాల దౌత్య వర్గాలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా నిశితంగా గమనిస్తోంది.
🏠 Home