🏠 www.manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 03 July 2026, 08:27 AM Posted by: MANA VISHWAM

లక్ష్మీబాయి ఆకస్మిక బదిలీ: కక్షసాధింపే అన్న హరీష్

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీబాయి పై బదిలీ వేటు

మార్కెటింగ్ డైరెక్టర్‌ పోస్టు నుంచి హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా స్థానచలనం

ప్రశ్నిస్తున్నారనే పగతోనే ఇదంతా.. రిటైర్మెంట్ రూల్స్‌ను తుంగలో తొక్కారు: హరీష్ రావు ఫైర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి, సీనియర్ అధికారిణి లక్ష్మీబాయిపై బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను ఆ స్థానం నుండి హఠాత్తుగా తప్పించి, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేవలం పరిపాలనాపరమైన సాధారణ బదిలీయేనని సచివాలయ వర్గాలు చెప్తున్నప్పటికీ.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

​ఆఘమేఘాల మీద బదిలీ ఎందుకు? – హరీష్ రావు ప్రశ్న

​లక్ష్మీబాయి ఆకస్మిక బదిలీపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా రాజకీయ కుట్రతోనే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
​"ప్రభుత్వ అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే, ఆయనపై ఉన్న పగతో సతీమణిని లక్ష్యంగా చేసుకున్నారు. ఉద్యోగ విరమణకు ఏడాది మాత్రమే సమయం ఉన్న అధికారులను బదిలీ చేయకూడదనే స్పష్టమైన జీవో (GO) రాష్ట్రంలో అమలులో ఉంది. అలాంటి నియమ నిబంధనలను సైతం బేఖాతరు చేస్తూ, అంత అత్యవసరంగా ఆమెను ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది?" అని హరీష్ రావు నిలదీశారు.

​లీడర్ల మధ్య రాజకీయం ఉండాలి కానీ.. కుటుంబాలను లాగుతారా?

​ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుబడుతూ తమ హయాంలో నడిచిన పాలనను హరీష్ రావు గుర్తుచేశారు. ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి కూడా గతంలో ఐఏఎస్ అధికారిణిగా పనిచేశారని.. రాజకీయంగా తమకు శ్రీధర్ బాబుతో ఎన్ని విభేదాలు ఉన్నా, ఆమె విధుల్లో తామెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. తాము అధికారులకు సముచిత గౌరవం ఇచ్చామని, ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఎప్పుడూ తావివ్వలేదన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి అధికారుల కుటుంబాలను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన దుయ్యబట్టారు.



🏠 Home